శిరస్సు వంచి.. సమాధికి ప్రణమిల్లి
నేడు.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 102వ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తోన్నారు. ఏపీలో అధికార టీడీపీ మహానాడును జరుపుకొంటోంది.
మహానాడు రెండవ రోజు ప్రతినిధులు సభ జరుగనుంది. తొలి రోజైన మంగళవారం నాడు ప్రవేశపెట్టిన తీర్మానాలను నేడు సభ ఆమోదించనుంది. చివరి రోజైన గురువారం నాడు దాదాపు అయిదు లక్షల మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ మహానాడు ప్రాంగణంలోనే బస చేశారు.

కాగా- ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన మనవళ్లు, ప్రముఖ నటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్.. నివాళి అర్పించారు. ఈ ఉదయం వాళ్లు హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించారు. సమాధిపై పూలమాలలు ఉంచి నివాళి అర్పించారు. కొద్దిసేపు మౌనం పాటించారు.
వారిద్దరూ ఒకే కారులో నెక్లస్ రోడ్ ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకున్నారు. అప్పటికే అక్కడికి వచ్చిన టీడీపీ, నందమూరి అభిమానులతో కలిసి సమాధి వద్దకు వెళ్లారు. తొలుత కల్యాణ్ రామ్, ఆ తరువాత ఎన్టీఆర్.. సమాధిపై పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళి అర్పించారు. అనంతరం కొద్దిసేపు అక్కడే కూర్చున్నారు. మౌనం పాటించారు. ఆ సమయంలో జూనియర్, కళ్యాణ్ రామ్ భావోద్వేగంతో కనిపించారు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ ను అలంకరించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇక్కడికి రానున్నందున బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు పోలీస్ సిబ్బందిని నియమించారు. వాహనాల రాకపోకలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications