ఏఈఈ సివిల్ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలోనే: టీఎస్‌పీఎస్సీ క్లారిటీ
హైదరాబాద్: ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) కీలక నిర్ణయం తీసుకుంది. ఏఈఈ(సివిల్) పోస్టులకు ఆన్‌లైన్‌లో రాతపరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
మే 21న ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించింది. అయితే.. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్, మెకానికల్ పోస్టులతో పాటు సివిల్ పోస్టులకు కూడా ఆన్‌లైన్ విధానంలోనే రాతపరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది.
మే 21, 22 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో ఏఈఈ(సివిల్) పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. మే 8న ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మే 9న అగ్రికల్చర్, మెకానికల్ ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనున్నారు.

ఈ ఏడాది జనవరి 22న నిర్వహించిన ఏఈఈ పరీక్షను పేపర్ లీకేజీ కారణంగా కమిషన్ రద్దు చేసిన విషయం తెలిసిందే. 1,540 పోస్టుల భర్తీకి ఏఈఈ నోటిఫికేషన్‌ను 2022 సెప్టెంబర్ 3న టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ఈ పోస్టులకు 44,352 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో మరో ఇద్దరి అరెస్ట్
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో తాజాగా శుక్రవారం మరో ఇద్దరు అరెస్టయ్యారు. కేసుకు సంబంధించి మహబూబ్‌నగర్‌కు చెందిన మైబయ్య, ఆయన కుమారుడు జనార్ధన్‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. జనార్ధన్ కోసం డాక్యానాయక్‌కు రూ. 2 లక్షలు ఇచ్చి మైబయ్య ఏఈ పేపర్ కొన్నట్లు సిట్ అధికారులు తమ దర్యాప్తులో తేల్చారు. కాగా, వికారాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో మైబయ్య టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.
ఈ క్రమంలోనే డాక్యానాయక్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఏఈ ప్రశ్నపత్రానికి రూ. 6 లక్షలు ఇవ్వాలని మైబయ్యను డాక్యా నాయక్ కోరాడు. అయితే, రూ. లక్షల మాత్రమే ఇస్తానని మైబయ్య చెబుతూ.. ఆ డబ్బును డాక్యా నాయక్ అకౌంట్ కు బదిలీ చేశాడు. ఆ తర్వాత ఏఈ ప్రశ్నపత్రాన్ని మైబయ్యకు డాక్యా అందజేశాడు. దాన్ని మైబయ్య తన కుమారుడు జనార్ధన్‌కు ఇచ్చి పరీక్ష రాయించాడు. తాజాగా, ఈ తండ్రీకొడుకుల అరెస్టుతో లీకేజీ వ్యవహారంలో అరెస్టైన వారి సంఖ్య 19కి చేరింది.












Click it and Unblock the Notifications