పాడినంతకాలం మోడీతో డ్యూయెట్లు పాడి ఇప్పుడు కేసీఆర్ పిల్లిలా ఎందుకు దాక్కుంటున్నాడు? ప్రశ్నించిన షర్మిల
దేశ ప్రధాని నరేంద్ర మోడీ రేపు రామగుండం పర్యటన తెలంగాణ రాష్ట్రంలో రచ్చగా మారింది. రాజకీయ రగడకు కారణంగా మారింది. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ని ప్రారంభించి జాతికి అంకితం చేయడానికి వస్తున్న నరేంద్ర మోడీ పర్యటనను అడ్డుకోవాలని టిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎప్పుడో ఉత్పత్తి ప్రారంభించిన ఎరువుల ఫ్యాక్టరీ ఇప్పుడు మోడీ ప్రారంభించడం వెనక ఆంతర్యం ఏమిటని టిఆర్ఎస్ పార్టీ మోడీ పర్యటన ను టార్గెట్ చేస్తుంది.
తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి విఫలమైన, దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్న, సింగరేణి మైన్స్ ప్రైవేటీకరణ చేయడానికి రెడీ అయిన మోడీపై వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా విభిన్న వర్గాల నుండి మద్దతును కూడగట్టి పెద్ద ఎత్తున ప్రతిఘటన ప్రారంభించింది. దీనిపై బిజెపి టిఆర్ఎస్ ప్రభుత్వం ని టార్గెట్ చేస్తోంది. మోడీ వస్తే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని ప్రశ్నిస్తుంది.
మోడీ పర్యటనపై కేసీఆర్ ను టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల
ఇక ఇదే సమయంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల రామగుండం లో ప్రజా ప్రస్థానం పాదయాత్రను నిర్వహిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. రామగుండం పర్యటనలో ఉన్న వైఎస్ షర్మిల ప్రధాని నరేంద్ర మోడీ రామగుండం పర్యటన పై వ్యాఖ్యలు చేశారు. మోడీ గారు మన రాష్ట్రానికి వస్తే..కేసీఆర్ పిల్లిలా ఎందుకు దాక్కుంటున్నాడు? చెప్పాలని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్ర సమస్యలపై మోడీ గారిని ప్రశ్నించే దమ్ము లేదా? అంటూ వైఎస్ షర్మిల నిలదీశారు.

పాడినంత కాలం మోడీతో డ్యూయెట్లు .. ఇప్పుడు ఇలా పిల్లిలా
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించాలని వైయస్ఆర్ రూ.10వేల కోట్ల రుణాల రద్దు చర్యలు తీసుకున్నారని పేర్కొన్న వైయస్ షర్మిల వైయస్ఆర్ బతికే ఉంటే 13ఏండ్ల కిందనే ఫ్యాక్టరీ ఓపెన్ అయ్యేదని వ్యాఖ్యలు చేశారు. పాడినంత కాలం మోడీతో కలిసి డ్యూయెట్లు పాడి ఇప్పుడు ప్రజల అవసరాలను అడగాల్సిన చోట కేసీఆర్ ముఖం చాటేస్తున్నారు అని వైయస్ షర్మిల మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న కెసిఆర్ కు ఎదురెళ్లి మన రాష్ట్రానికి రావాల్సిన వాటిని సాధించుకోవాల్సిన కేసీఆర్ ఎందుకు దాక్కుంటున్నారో చెప్పాలని వైయస్ షర్మిల ప్రశ్నించారు.
తెలంగాణా విభజన హామీలపై మోడీని అడిగాలి కదా..
తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించాలని, రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటన చేసిన కేంద్రం తెలంగాణకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో అడగాలని వైయస్ షర్మిల పేర్కొన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం లో తాము రుణమాఫీ చేయలేదని, కనీసం కేంద్రంలో అయినా రుణమాఫీ చేయాలని నరేంద్ర మోడీని కెసిఆర్ ప్రశ్నించవచ్చు కదా అంటూ వైయస్ షర్మిల నిలదీశారు. అసలు ఎదురే పడకుండా తప్పించుకుని తిరిగితే రాష్ట్ర అవసరాలను ఎవరు అడుగుతారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

సింగరేణి ఓపెన్ కాస్టులపై కూడా కేసీఆర్ ను టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల
అంతేకాదు సింగరేణి బొందలగడ్డ అవుతుందని ఉద్యమంలో నీతులు పలికిన కేసీఆర్.. ఓపెన్ కాస్టులు పెంచి ఈయనే బొందలగడ్డలు తవ్వుకుంటూ పోతున్నారని వైయస్ షర్మిల మండిపడ్డారు. వైయస్ఆర్ గారు 30వేల మందికి ఇండ్ల పట్టాలు ఇస్తే.. కేసీఆర్ ఒక్క పట్టా కూడా ఇవ్వలేదని వైయస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికుల కోసం కెసిఆర్ చేసింది ఏంటో చెప్పాలని వైయస్ షర్మిల నిలదీశారు.












Click it and Unblock the Notifications