తెలంగాణలో ఐఎఎస్ బదిలీలు: హైదరాబాద్ సహా పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లు.. !!
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది తెలంగాణ. దీనికి సంబంధించిన వేడి రాజుకుంటోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ఇక ఎంతో సమయం లేదు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార భారత్ రాష్ట్ర సమితి.. హ్యాట్రిక్‌పై గురి పెట్టింది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది.
ఈ పరిణామాల మధ్య తెలంగాణలో భారీ ఎత్తున ఐఎఎస్ అధికారుల బదిలీలు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏకంగా 31 మంది ఐఎఎస్ అధికారులను కేసీఆర్ ప్రభుత్వం బదిలీ చేసింది.. వారికి స్థాన చలనం కల్పించింది. జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖలు, విభాగాధిపతులు.. ఇలా దాదాపుగా అన్ని స్థాయిల్లో ఉన్న ఐఎఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీఓను విడుదల చేశారు.

వెయిటింగ్‌లో ఉన్న డాక్టర్ శశాంక్ గోయెల్‌ను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డీజీగా నియమించింది ప్రభుత్వం. అక్కడున్న బెన్హర్ మహేష్ దత్ ఎక్కాను రిలీవ్ చేసింది. వెయిటింగ్‌లో ఉన్న శైలజా రామయ్యర్‌ను యువజన వ్యవహారాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించింది. అక్కడున్న సందీప్ కుమార్ సుల్తానియాను రిలీవ్ చేసింది.
వెయిటింగ్‌లో ఉన్న దాసరి హరిచందన.. ఆయుష్ డైరెక్టర్‌గా అపాయింట్ అయ్యారు. అక్కడున్న ప్రశాంతి రిలీవ్ అయ్యారు. అలగు వర్షిణి చేనేత, టెక్స్‌టైల్స్ శాఖ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె వెయిటింగ్‌లో ఉన్నారు. అక్కడున్న జ్యోతి బుద్ధ ప్రకాష్ రిలీవ్ అయ్యారు. స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ కొర్ర లక్ష్మీ స్పోర్ట్స్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు.
వెయిటింగ్‌లో ఉన్న కే హైమావతి ఎయిడ్స్ సొసైటీ డైరెక్టర్‌గా, పంజాగుట్ట డివిజన్ అదనపు కమిషనర్ కే హరిత ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శిగా బదిలీ అయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ కే స్వర్ణలత బదిలీ అయ్యారు. ఆమెకు పోస్టింగ్ ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. వెయిటింగ్‌లో ఉన్న కే నిఖిల పర్యాటక శాఖ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు.
వెయిటింగ్‌లో ఉన్న ఎం సత్య శారదా దేవిని వ్యవసాయం, సహకార శాఖ డిప్యూటీ కార్యదర్శిగా నియమించింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ప్రియాంక అల.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. అక్కడ ఎఫ్ఏసీగా ఉన్న అనుదీప్ దురిషెట్టి రిలీవ్ అయ్యారు. ములుగు అదనపు జిల్లా కలెక్టర్ ఐలా త్రిపాఠిని అదే జిల్లాకు కలెక్టర్‌గా నియమించింది ప్రభుత్వం. అక్కడున్న కృష్ణ ఆదిత్యను బదిలీ చేసింది.
కృష్ణ ఆదిత్యను కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా నియమించింది. అక్కడ ఎఫ్ఏసీగా ఉన్న నీతుకుమారి ప్రసాద్‌ను రిలీవ్ చేసింది. సిద్ధిపేట్ జిల్లా అదనపు కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్.. పెద్దపల్లికి, పెద్దపల్లి కలెక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ టీఎస్ ఫుడ్ బోర్డ్ ఎండీగా బదిలీ అయ్యారు.
జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్.. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. అక్కడున్న గౌతమ్ పొట్రు సెర్ప్ సీఈఓగా బదిలీ అయ్యారు. కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే మహబూబ్ నగర్ జిల్లా అదనపు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్.. ఖమ్మం జిల్లాకు బదిలీ అయ్యారు. అక్కడున్న స్నేహ శబరీష్.. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా నియమితులయ్యారు.
నాగర్‌కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరి.. కామారెడ్డికి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ దివాకర టీఎస్ జగిత్యాలకు బదలీ అయ్యారు. జగిత్యాల అదనపు కలెక్టర్ మందా మకరండు బదిలీ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ అనుదీప్ దురిషెట్టి.. హైదరాబాద్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. అక్కడ ఎఫ్ఏసీగా ఉన్న అమోయ్ కుమార్ రిలీవ్ అయ్యారు.
పెద్దపల్లి అదనపు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ నాగర్ కర్నూల్‌కు బదిలీ చేశారు. అక్కడున్న మను చౌదరికి పోస్టింగ్ ఇవ్వలేదు. కరీంనగర్ జిల్లా పరిషత్ సీఈఓ చెక్కా ప్రియాంక.. పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. వెయిటింగ్‌లో ఉన్న జల్దా అరుణశ్రీ కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్‌గా నియమితులయ్యారు. అక్కడున్న గరిమా అగర్వాల్ బదిలీ అయ్యారు.
నిజామాబాద్ అదనపు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ బడుగు సంగారెడ్డికి ట్రాన్స్‌ఫర్ అయ్యారు. కరీంనగర్ జాయింట్ కలెక్టర్‌గా శిక్షణలో ఉన్న డాక్టర్ నవీన్ నికొలస్.. రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. అక్కడ ఎఫ్ఏసీగా ఉన్న డీ రొనాల్డ్ రాస్ రిలీవ్ అయ్యారు. మెదక్ అదనపు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్.. రంగారెడ్డి జిల్లాకు, కరీంనగర్ అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సిద్ధిపేట్ జిల్లాకు బదిలీ అయ్యారు. మందా మకరండు నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు.












Click it and Unblock the Notifications