పాఠశాలలోనే టీచర్లతో కలిసి మద్యం సేవించిన ఎంఈవో, చిందులు: వీడియో వైరల్
ఆదిలాబాద్: విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు సక్రమంగా పనిచేస్తున్నారో లేదో చూసే బాధ్యత కలిగిన మండల విద్యాధికారి మద్యానికి బానిసైన వ్యవహారం ఆదిలాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. ఏకంగా పాఠశాల ఆవరణలోనే ఆయన మద్యం సేవించడం గమనార్హం.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎంఈవో నర్సింహులు ఇతర ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత స్కూల్ ఆవరణలో పేకాడారు, చిందులు వేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ నేపథ్యంలో సదరు ఎంఈవో, ఆయనతోపాటు ఉన్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎంఈవో స్థాయి అధికారి ఇలా పాఠశాలలోనే మద్యం సేవించి, ఇష్టం వచ్చినట్లు ప్రర్తించడం దారుణమని, ఆయనపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
అయితే, ఇవి ఎప్పుడో జరిగిన పాత వీడియోలను కావాలనే కొందరు కొత్తగా వైరల్ చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త వీడియోలైనా.. పాత వీడియోలైనా చేసింది తప్పే కాబట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు ఉన్నతాధికారులను కోరుతున్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులకు డీడీఎఫ్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.