పిలిచేందుకు కెసిఆర్ ఇంటికెళ్తా: చంద్రబాబు, 'అమరావతి'కి వచ్చేనా?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రత్యర్థి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇంటికి వెళ్లనున్నారా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. ఈ నెల 22వ తేదీన అమరావతి శంకుస్థాపన వేడుకలు ఏపీ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించనుంది.
ఈ వేడుకలకు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. వీరితో పాటు దేశ, విదేశీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఇందులో భాగంగా కెసిఆర్‌ను కూడా ఆహ్వానిస్తారు.
అయితే, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గతంలో ఇరువురు కలిసి ఒకే పార్టీలో పని చేసిన దృష్ట్యా చంద్రబాబు... కెసిఆర్‌కు ఎలా ఆహ్వానం పలకనున్నారనే చర్చ సహజంగానే సాగుతోంది. అయితే, చంద్రబాబు కెసిఆర్ ఇంటికి స్వయంగా వెళ్లి ఆహ్వానించాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.
శనివారం నాడు ఏపీ కేబినెట్ సమావేశం విజయవాడలో భేటీ అయింది. ఈ భేటీలో రాజధాని శంకుస్థాపనకు ఎవరెవరిని ఆహ్వానించాలి, ఎలా ఆహ్వానించాలనే దాని పైన చర్చించారు. ఈ సందర్భంగా మంత్రులతో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్య చేశారని తెలుస్తోంది.

రాజధాని అమరావతి శంకుస్థాపనకు రావాలని నేనే కెసిఆర్ ఇంటికి స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తానని మంత్రులతో చంద్రబాబు వ్యాఖ్యానించారని సమాచారం. ఇతర రాష్ట్రాల ప్రముకులను ఆహ్వానించే బాధ్యత మంత్రుల పైన వేశారు.
అన్ని రాజకీయ పక్షాల చీఫ్‌లు, సీఎంలు, గవర్నర్లను ఆహ్వానిస్తారు. రాజకీయ వైరం ఉన్నప్పటికీ... ఒకే పార్టీలో పని చేయడం, తెలుగు ముఖ్యమంత్రులు అయినందున.. చంద్రబాబు చొరవ తీసుకొని ఇంటికి వెళ్లి ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు.
అయితే, చంద్రబాబు ఆహ్వానాన్ని మన్నించి కెసిఆర్ అమరావతి శంకుస్థాపనకు వస్తారో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
రాజధాని ఆహ్వాన పత్రాన్ని ఆవిష్కరించిన ఏపీ సీఎం చంద్రబాబు
విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశంలో... రాజధాని ఆహ్వాన పత్రాన్ని మంత్రివర్గ సమావేశంలోనే ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, చిన రాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications