కెసిఆర్‌కు బాబు షాకిస్తారా?: రూ.70వేల కోట్లపై కన్ను, ఏపీకి పెద్ద విజయమే!
హైదరాబాద్: ఇటీవల ఏపీ ఉన్నత విద్యా మండలి పిటిషన్ పైన సుప్రీం కోర్టులో తెలంగాణకు చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షెడ్యూల్ 9, 10ల పైన కూడా కన్నేశారని వార్తలు వస్తున్నాయి.
ఆస్తులు తమకే చెందుతాయని తెలంగాణ వాదించగా, దాంతో సుప్రీం కోర్టు విభేదించింది. విభజనకు ముందు ఉన్న ఆస్తులను 58:42 శాతంగా పంచుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు షెడ్యూల్ 9, 10లలో ఉన్న అన్ని ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన ఆస్తుల్లో వాటా కోరేందుకు సిద్ధమైంది.
షెడ్యూల్ 9, 10లో దాదాపు 120 ఇనిస్టిట్యూషన్ల పేర్లు ఉన్నాయి. వీటన్నింటినీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే తెలంగాణ సర్కారు తన అధీనంలోకి తీసుకుంది. వీటన్నింటి ఆస్తుల విలువ లెక్క తీస్తే దాదాపు రూ.1.30 లక్షల కోట్లకు పైగా ఉన్నాయని తెలుస్తోంది.

వాటిల్లో తన వంతు 58 శాతం వాటాగా కనీసం రూ.70 వేల కోట్ల విలువైన ఆస్తులు దక్కుతాయని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. ఉన్నత విద్యామండలి బ్యాంకు ఖాతాల్లో విభజనకు ముందున్న నగదులో సైతం ఏపీకి వాటాను ఇవ్వడం, మండలి ఫిక్స్‌డ్ డిపాజిట్లలో వాటా ఇవ్వడంతో, మిగతా సంస్థల విషయంలోనూ బ్యాంకు ఖాతాలపై హక్కులను అడగాలని ఏపీ భావిస్తోంది.
షెడ్యూల్ 9, 10ల్లో పేర్కొన్న సంస్థలకు సంబంధించి దాదాపు రూ.3,800 కోట్లు వివిధ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
సుప్రీం కోర్టు వెల్లడించినట్టు 58 శాతం వాటా ఏపీకి వస్తే దాదాపు రూ.70 వేల కోట్లకు పైగా విలువైన ఆస్తులు, బ్యాంకు డిపాజిట్లు రాష్ట్ర ఖజానాకు వస్తాయని, ఇదే జరిగితే టిడిపి ప్రభుత్వం ఓ పెద్ద విజయాన్ని సాధించినట్టేనని మంత్రి గంటా శ్రీనివాస రావు చెబుతున్నారు.
కాగా, ఈ 120 సంస్థల వివరాలు, వాటి ఆస్తులను లెక్కించేందుకు ఓ కమిటీని నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. వీటిల్లో అత్యధికం హైదరాబాద్ నగరంలో ఉండగా ప్రస్తుతం దాదాపు అన్ని సంస్థలూ తెలంగాణ ప్రభుత్వం అధీనంలోనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications