తెలుగు జాతి సెల్యూట్: గద్దర్ మృతిపై సీఎం జగన్, చంద్రబాబు దిగ్భ్రాంతి
హైదరాబాద్/అమరావతి: ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, టీడీపీ నేత నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గద్దర్ మరణం సమాజానికి తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ప్రజా కవి గద్దర్ మరణంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భాంతి వ్యక్తం చేశారు.
'ప్రజా కవి - గాయకుడు, బడుగు, బలహీనవర్గాల విప్లవ స్ఫూర్తి గద్దర్. గద్దర్ పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణల పాటే. ఆయన నిరంతరం సామాజిక న్యాయం కోసమే బతికారు. ఆయన మరణం ఊహించనిది. సామాజిక న్యాయ ప్రవక్తల భావాలు, మాటలు, వారి జీవితాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ జీవించే ఉంటాయి. గద్దర్‌కి మొత్తంగా తెలుగు జాతి సెల్యూట్ చేస్తోంది. ఆయన కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో మనమంతా బాసటగా ఉందాం' అని సీఎం జగన్ పేర్కొన్నారు.

గద్దర్ మరణం పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల నా సంతాపం తెలియచేస్తున్నాను. తనపాటలతో ప్రజా చైతన్యానికి ఎనలేని కృషి చేసిన "ప్రజా యుద్ధనౌక" గద్దర్. తన గళంతో ప్రజలను కదిలించిన గద్దర్ మృతితో ప్రజా ఉద్యమాల్లో... పౌరహక్కుల పోరాటాల్లో...ఒక శకం ముగిసినట్లు అయ్యింది. గద్దర్ కుటుంబసభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను' అని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.
'ప్రజా గాయకుడు గద్దర్ గొంతు మూగబోయిందని సమాచారం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. విప్లవోద్యమాలకి తన పాటనిచ్చారు. తెలంగాణ ఉద్యమ గళం అయ్యారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ స్మృతిలో నివాళులు అర్పిస్తున్నాను. ప్రజల పాటకి జోహార్. ఉద్యమగీతానికి జోహార్. గద్దర్ అమర్ రహే..' అని టీడీపీ నేత నారా లోకేష్ వ్యాఖ్యానించారు. కాగా, ప్రజా గాయకుడు గద్దర్ ఆదివారం మధ్యాహ్నం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతితో ఉద్యమ లోకం విషాదంలోకి వెళ్లిపోయింది.
గద్దర్ మృతి విషయం తెలసుకున్న కాంగ్రెస్ నాయకులు అమీర్‌పేటలోని అపోలో ఆస్పత్రికి చేరుకుని కుటుంబసభ్యులను పరామర్శించారు. ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ వీ హనుమంతరావు, ఎమ్మెల్యే సీతక్క, మల్లు రవి తదితరులు గద్దర్ భార్య విమలను ఓదార్చారు. గద్దర్ మరణం సమాజానికి తీరని లోటన్నారు. మరోవైపు, ఎల్పీ స్టేడియంలో గద్దర్ పార్థీవదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు.












Click it and Unblock the Notifications