ఢిల్లీలో చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారు: కర్నె ప్రభాకర్
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు, టీడీపీ నేతలు గవర్నర్ నరసింహన్‌ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. గవర్నర్‌ను ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని నిలదీశారు. గవర్నర్ రాజ్యాంగబద్దంగా వ్యవహరిస్తామంటే బ్లాక్‌మెయిల్ చేస్తూ బెదిరిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చట్టానికి లోబడి పనిచేస్తామని రాజ్యాంగ బద్దంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు ఇలా వ్యవహరించడం సరికాదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు కేంద్రంలో ఉన్న నేతల కాళ్లు పట్టుకున్నా మద్ధతు దొరకడంలేదని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ సహకారం కూడా లభించకపోవడంతో సెక్షన్-8తో గవర్నర్ కు అధికారాలు కల్పించాలని అంటున్నాడని మండిపడ్డారు. ఈ కేసులో నిందితునిగా ఉన్న జెరుసెలం మత్తయ్యను ఏపీ పోలీసుల తమ అదుపులో ఉంచుకోవడం దారుణమన్నారు. హైదరాబాదు నగరంలోని ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేసిన వాళ్ల ఇండ్లు కూలగొడితే ఆంధ్రుల ఇండ్లను కూల్చి వేశారని కేంద్రానికి ఫిర్యాదు చేశారని కర్నె విమర్శించారు.

చంద్రబాబు నాయుడిపై ఏసీబీ అధికారులు కేసు పెట్టడాన్ని రెండు రాష్ర్టాల మధ్య సమస్యగా చిత్రీకరించేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఇది రెండు రాష్ర్టాల మధ్య సమస్య కానేకాదని అన్నారు. ఇందులో టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమేనని, చట్టం తనపని తాను చేసుకు పోతోందని వివరించారు.
చంద్రబాబు నాయుడు తప్పు చేయకుంటే గత పది రోజులుగా నిద్రలేని రాత్రులు ఎందుకు గడుపుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటి ముందు ఏపీ పోలీసులతో రక్షణ ఎందుకు ఏర్పాటు చేసుకుంటారని అడిగారు. ఏపీ పోలీసుల రక్షణలో చంద్రబాబు బతుకుతున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన వివాదాస్పద పనులు చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు తప్పు చేశాడని అనేందుకు కేసులో నిందితుడు జెరూసెలం మత్తయ్యను దాచడమే సాక్ష్యమని అన్నారు. మత్తయ్య ఎక్కడున్నాడో నేను చెప్పానని అయినా ఏపీ పోలీసులు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. సీఎం ఆదేశం మేరకు మత్తయ్యకు విజయవాడలో మంత్రి చినరాజప్ప ఆధ్వర్యంలో రక్షణ కల్పిస్తున్నారని దుయ్యబట్టారు.
హైదరాబాద్‌లో నివాసం ఉండే మత్తయ్య సీఎం కేసీఆర్‌పై కేసులు పెడతారా? అని అన్నారు. సీఎం కేసీఆర్‌పై మత్తయ్య కేసు పెట్టిన వెంటనే ఏపీ పోలీసులు స్వీకరించి సీఐడీకి అప్పగించారని తెలిపారు. ఇదంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతోందని పేర్కొన్నారు. సంతలో పశువులను కొనుకునే రీతిలో ఎమ్మెల్యేలను కొంటూ ఇలాంటి తప్పులకు పాల్పడుతున్నారని అన్నారు.
ఏపీ పోలీసులు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేసి చట్టం దృష్టిలో అందరూ సమానమని, సామాన్య మానవుడు తప్పు చేస్తే శిక్షలు ఎలా ఉంటాయో నాయకులు చేసినా అలాగే ఉంటాయని ప్రజల్లో విశ్వాసం కలిగించాలని సూచించారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాలని చంద్రబాబు చూశారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కర్నె ప్రభాకర్ ఆరోపించారు. రేవంత్ వ్యవహారంపై ఇంత వరకు బాబు స్పందించలేదన్నారు. కేసును పక్కదారి పట్టించేందుకు ఫోన్ ట్యాపింగ్ అంటున్నారని ఆరోపించారు. గవర్నర్‌ను బ్లాక్ మెయిల్ చేస్తున్న ఏపీ మంత్రులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మత్తయ్య ఏపీ హోంమంత్రి సంరక్షణలో ఉన్నారన్న కర్నె ప్రభాకర్ మత్తయ్యపెట్టిన కేసును సీఐడీకి బదిలీ చేశారన్నారు.












Click it and Unblock the Notifications