AP weather: ఏపీలో మరికొద్దిరోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అల్పపీడనం ఎఫెక్ట్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొద్ది రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దగ్గరలోని దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళఖాతం దగ్గరలోని దక్షిణ ఆంధ్ర -ఉత్తర తమిళనాడు కోస్తా ప్రాంతం మీద ఉంది. ఇది సగటు సముద్ర మట్టమునకు 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది.
ఆగ్నేయ బంగాళా ఖాతం, దాని దగ్గర భూమధ్య రేఖ వద్ద ఉన్న హిందూ మహా సముద్రము -సుమత్రా తీర ప్రాంతాల మీద ఉన్నఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టమునకు 3 .1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం, దాని దగ్గర ఉన్న ప్రాంతాల మీద సుమారు నవంబర్ 9వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది మరింత బలపడి రాగల 48 గంటలలో పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు తీరం వైపుకు ప్రయాణించే అవకాశం ఉంది.
వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. సోమవారం ప్రధానంగా వాతావరణం పొడిగా ఉంటుంది. దక్షిణ కోస్తాంధ్ర శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
రాయలసీమలో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.
కాగా, ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తం కొనసాగుతోందని, ఈ నవంబర్ 9 నాటికి అది అల్పపీడనంగా మారనుందని వివరించింది. క్రమేపీ అది బలపడి వాయవ్య దిశగా పయనిస్తుందని, దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడులోనూ, దక్షిణ కోస్తాంధ్రలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
నవంబర్ 11, 12 తేదీల్లో దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారడంతో కోస్తా తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. నవంబర్ 9, 10వ తేదీల్లో తమిళనాడులోనూ... 10, 11, 12 తేదీల్లో దక్షిణ కోస్తాంధ్రలోనూ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు నవంబర్ 9 లోపు తీరప్రాంతాలకు చేరుకోవాలని స్పష్టం చేసింది. కాగా, ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో పంట నీటమునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications