జీఎస్టీ తగ్గిందని సంబరపడకోయ్: తెలంగాణలో కొత్త వాహనాలపై భారీగా పన్ను విధింపు?
మొన్నీ మధ్యే వాహనాలపై జీఎస్టీ భారీగా తగ్గింది. ఫలితంగా స్కూటర్ల దగ్గరి నుంచి కార్ల వరకూ రేట్లు భారీగా తగ్గాయి. ఒక్కో కారు దాని రేంజ్ ను బట్టి గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు రేట్లు తగ్గాయి. దీనికి అనుగుణంగా కార్ మేకింగ్ కంపెనీలు మారుతి సుజుకి, హ్యుండాయ్, మహీంద్ర కంపెనీలు తమ రేట్లను సవరించాయి కూడా. ఈ నెల 22వ తేదీ నుంచి ఈ తగ్గించిన జీఎస్టీ అమలులోకి రానుంది. ఫలితంగా.. ఈ దసరా- దీపావళి సీజన్ లో వాహనాల రేట్లు భారీగా పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి.
దీన్ని సొమ్ము చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కొత్త వాహనాలపై ప్రత్యేకంగా అదనపు సెస్ విధించాలని ప్రతిపాదించింది. రోడ్ సేఫ్టీ పేరుతో ఈ సెస్ భారం కొనుగోలుదారులపై మోపబోతోంది. వాహన బీమా, రిజిస్ట్రేషన్ సమయంలో వాటికి చెల్లంచాల్సిన లైఫ్ ట్యాక్స్ తో పాటు కొత్తగా ఈ రోడ్ సేఫ్టీ సెస్ కూడా వారి నెత్తిన పడనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు చెబుతున్నారు.

వాహనం రేంజ్ ను బట్టి 2,000 మొదలుకుని 10,000 రూపాయల వరకు రోడ్డు భద్రత సెస్ ఉండొచ్చని తెలుస్తోంది. ఈ అదనపు సెస్ రూపంలో సంవత్సరానికి 270 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. వ్యక్తిగత, వాణిజ్య వాహనాలు.. అంటే అన్ని రకాల కార్లు, మినీ టెంపోలు, పికప్ వెహికల్స్ వంటి వాహనాలపై ఈ సెస్ భారం పడబోతోంది. చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాల నేపథ్యంలో వ్యవసాయ రంగంలో వినియోగించే వాహనాలకు దీని నుంచి మినహాయింపు ఉంటుందని చెబుతున్నారు. అలాగే- ఆటోలపైనా సెస్ భారం ఉండదని అంటున్నారు.
అదనపు సెస్ రూపంలో వచ్చిన మొత్తాన్ని రోడ్ సేఫ్టీ చర్యలకు వినియోగించాలనేది ప్రభుత్వం ఆలోచన. మరింత విస్తారంగా రోడ్డు భద్రత వారోత్సవాలను నిర్వహించడం, వీటిపై డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడం, అవగాహన శిబిరాలను ఏర్పాటు చేయడం, రోడ్ల మరమ్మతులు, డివైడర్స్ నిర్మాణం, తరచూ వాహన ప్రమాదాలు సంభవించే బ్లాక్ స్పాట్స్ వంటి ప్రదేశాల్లో రిఫ్లెక్టింగ్ పెయింట్ వాడటం.. వంటి చర్యలకు అయ్యే ఖర్చును ఈ సెస్ ద్వారా వచ్చే మొత్తం నుంచి ప్రభుత్వం భరిస్తుంది.












Click it and Unblock the Notifications