హైదరాబాద్‌లో నిర్మాణాలు చేస్తున్నారా? అలా చేస్తే జైలుకే.. షాకింగ్ హెచ్చరిక!
హైదరాబాదులో ఇల్లు నిర్మిస్తున్నారా? షాపింగ్ కాంప్లెక్స్ లు గట్రా నిర్మాణం చేస్తున్నారా? అయితే ఈ విషయం మీరు తప్పక తెలుసుకోవాల్సిందే. ఇకపై హైదరాబాద్లో నిర్మాణాలు చేపట్టే వారికి కీలక అలర్ట్ ఇచ్చింది హైడ్రా. నిర్మాణాల విషయంలో అవకతవకలకు పాల్పడితే జైలుకు పంపిస్తామని తేల్చి చెప్పింది. ఇక ఆ కథ కమామిషు వివరాల్లోకి వెళితే..
వారికి చుక్కలు చూపించేందుకు సిద్ధమైన హైడ్రా
చెరువులు, ప్రభుత్వభూములు, పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు, పార్కులు, రహదారులు తదితరాలను ఆక్రమించి నిర్మాణాలు చేసే వారిపైన ఉక్కుపాదం మోపడానికి హైడ్రా రెడీ అయింది. అంతేకాదు ఇసుక అక్రమరవాణా చేసేవారిని, చెరువులు, బహిరంగ ప్రదేశాలలో నిర్మాణాలకు సంబంధించిన వ్యర్ధాలను వేసేవారిని కూడా కఠినంగా శిక్షించడానికి హైడ్రా సిద్ధమైంది. వాళ్లపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి నేరుగా జైలుకు పంపించడమే లక్ష్యంగా ప్రత్యేక పోలీస్ స్టేషన్ ను సైతం ఏర్పాటు చేస్తుంది.

ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఉద్దేశం ఇదే
బుద్ధ భవన్ లోని హైడ్రా ప్రధాన కార్యాలయం పక్కన ఒక ప్రత్యేక పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసి హైడ్రా రంగంలోకి దిగుతుంది. ఇప్పటికే ప్రభుత్వ భూములు, చెరువులు, ftl పరిధిలో నిర్మించిన నిర్మాణాలను కూల్చివేసి హైదరాబాద్ వాసులను వణికించిన హైడ్రా ఇప్పుడు పోలీస్ స్టేషన్ ను కూడా ఏర్పాటు చేసి ఆక్రమణలకు పాల్పడి నిర్మాణాలు చేస్తే జైలుకు పంపడం ఖాయమని స్పష్టం చేసింది.
హైడ్రా కమిషనర్ ఏ.వి రంగనాథ్ ఏమన్నారంటే
ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపటం ఖాయమని, ఇదే విషయాన్ని హైడ్రా కమిషనర్ ఏ.వి రంగనాథ్ స్పష్టం చేశారు. ఇప్పటికే గతంలో అనేక వందల ఎకరాల ప్రభుత్వ భూములను, చెరువులను, పార్కులను, నాలాలను హైడ్రా పరిరక్షించిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఆక్రమణలకు సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లలో 50కిపైగా కేసులు విచారణలో ఉన్నాయని హైడ్రా ప్రత్యేక పోలీస్ స్టేషన్ అందుబాటులోకి వస్తే ఈ కేసులన్నీ అక్కడికి బదిలీ చేయబడతాయి అని ఆయన వెల్లడించారు.
పక్కా ఆధారాలతో జైలుకు పంపడం కోసమే హైడ్రా
అంతేకాకుండా కొత్త కేసులు నమోదు చేయడానికి కూడా ఇది సులభంగా ఉంటుందని హైడ్రా పోలీస్ స్టేషన్ గురించి వివరాలు తెలిపారు. చెరువుల ఆక్రమణలను పూర్తిగా అడ్డుకోవడం కోసం, ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతున్న వారిని పక్కా ఆధారాలతో జైలుకు పంపడం కోసమే హైడ్రా పనిచేస్తుందని ఆయన వెల్లడించారు.
ఏసిపి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ స్టేషన్ నిర్వహణ
ఈ ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఒక ఏసిపి ఆధ్వర్యంలో ఆరుగురు ఇన్స్పెక్టర్లు, 12మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 60మంది కానిస్టేబుల్ లతో నిర్వహించబడుతుంది అని, భవిష్యత్తులో ఫిర్యాదుల సంఖ్య పెరిగితే మరిన్ని పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఎవరైనా సరే చెరువులను చెత్త చెదారంతో నింపి, వాటిని ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తే జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందేనని హైడ్రా కమిషనర్ ఏ.వి రంగనాథ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications