మోడీపై అసదుద్దీన్ సెటైర్లు-మీ ఫ్రెండ్ అబ్బాస్ నే అడగాలంటూ- అసలేం జరిగిందంటే ?
మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల వివాదంలో నుపుర్ శర్మను అరెస్టు చేయాలని కొద్దిరోజులుగా డిమాండ్ చేస్తున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇవాళ మరోసారి ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. అయితే గతంలోలా నేరుగా విమర్శలు చేయకుండా మోడీ చిన్ననాటి స్నేహితుడు అబ్బాస్ ను ఇందులోకి లాగారు. దీంతో ఈసారి ఓవైసీ విమర్శలు చర్చనీయాంశం అవుతున్నాయి.

అసదుద్ధీన్ వర్సెస్ ప్రధాని మోడీ
ప్రధాని మోడీపై తరచూ ఏదో ఒక విషయంలో విమర్శలు చేస్తూ ఉండే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. ఇవాళ మరోసారి ఆయన్ను టార్గెట్ చేశారు. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను అరెస్టు చేయాలంటూ కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న అసద్.. తాజాగా ఆమెను ఢిల్లీ సీఎం చేసేలా ఉన్నారంటూ మరో వ్యాఖ్య కూడా చేశారు. ఇవాళ ఆ దాడిని మరింత ముమ్మరం చేస్తూ ప్రధాని మోడీ చిన్ననాటి స్నేహితుడిని కూడా ఇందులోకి లాగారు.

మోడీ బాల్యస్నేహితుడు అబ్బాస్
ప్రధాని మోడీ తాజాగా తన తల్లి హీరాబెన్ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెను కలిసి సపర్యలు చేశారు. ఆ విషయాన్ని ఆ తర్వాత అందరికీ షేర్ చేశారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి స్నేహితుడు అబ్బాస్ చిన్నప్పుడు తన ఇంటికి తరచూ వచ్చేవాడని, తన తల్లి హీరా బెన్ ఆయనకు పండుగల వేళ పిండి వంటలుకూడా చేసేదని తెలిపారు. అబ్బాస్ తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో తన తండ్రి అతడిని తమ ఇంట్లో తెచ్చిపెట్టారని, తనతో కలిసే అబ్బాస్ చదువుకున్నాడని కూడా తెలిపారు. ఇప్పుడు మోడీ చెప్పిన ఈ కథను అసదుద్దీన్ తన వార్ కోసం వాడేసుకుంటున్నారు.

మీ దోస్త్ అబ్బాస్ నే అడగాలన్న ఓవైసీ
మోడీ తన బాల్య స్నేహితుడు అబ్బాస్ గురించి చెప్పిన విషయాల్ని ప్రస్తావిస్తూ ఇవాళ అసద్ నుపుర్ శర్మ వివాదంలోకి ఆయన్ను లాగారు. మోదీ జీ ఒకవేళ మీ మిత్రుడు అబ్బాస్ ఉండి ఉంటే.. ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు సరైనవో కావో అడిగి తెలుసుకోవాలని కోరారు. నిజంగా మోదీకి ఇలాంటి ఫ్రెండ్ ఉన్నట్లు ఎవరికీ తెలియదన్నారు.
ఒకవేళ అబ్బాస్ ఉండి ఉంటే ఇస్లామిక్ మతపెద్దలతో పాటు తాను కూడా మాట్లాడే ప్రసంగాలను విని వాటిపై వివరణ ఇచ్చేలా మోదీ చర్యలు తీసుకోవాలని అసద్ కోరారు. అలాగే, సుపుర్ శర్మ వ్యాఖ్యలను అబ్బాస్ కూడా అంగీకరించడు. తామేమైనా ఏవైనా అబద్దాలు చెబితే.. మీ ఫ్రెండ్ అబ్బాస్ ద్వారా తెలుసుకోండి మోదీ జీ అంటూ అసద్ కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా.. అబ్బాస్ అడ్రస్ ఇస్తే తామే అతని వద్దకు వెళ్తామని ఓవైసీ స్పష‍్టం చేశారు.












Click it and Unblock the Notifications