నిఘా వైఫల్యమే.. పహల్గాం అటాక్ పై అసదుద్దీన్ ఒవైసీ షాకింగ్ కామెంట్స్ !
మినీ స్విట్జర్లాండ్‌గా గుర్తింపు పొందింది జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో గల పహల్గాం ప్రాంతం. నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండే ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఇప్పటివరకు 27 మంది మరణించినట్లు సమాచారం. అంతే కాకుండా తీవ్రంగా గాయపడిన పలువురిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ ఊహించని ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఓ వైపు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సౌదీ అరేబియా పర్యటనలో ఉండగా.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇండియాలో పర్యటిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్‌లో బరితెగించి.. ఏకంగా పర్యటకులను లక్ష్యంగా చేసుకుని మరీ దాడి చేయడం సంచలనంగా మారింది. అంతే కాకుండా వారి మతం ఏంటో అడిగి మరి కాల్పులకు తెగబడడం తీవ్ర విషాదాన్ని నింపుతోంది.

ఇప్పటికే ఈ ఘటనపై సినీ, రాజకీయ ప్రముఖులు.. పలు దేశాల అధ్యక్షులు విషాదం వ్యక్తం చేశారు. భారత్ కు అండగా ఉంటామంటూ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ ఉగ్రదాడికి నిఘా వైఫల్యమే కారణమని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఈ దారుణ ఘటన ఉరి, పుల్వామా సంఘటనల కంటే ప్రమాదకరమైందని వాపోయారు. ఈ సంఘటనపై నరేంద్ర మోడీ ప్రభుత్వం జవాబుదారీతనంగా వ్యవహరించాని డిమాండ్ చేశారు. అంతే కాకుండా మతం అడిగిన తర్వాత ఉగ్రవాదులు అమాయక ప్రజలను విచక్షణారహితంగా చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామన్నారు ఒవైసీ. ఉగ్రవాదులందరికీ ప్రభుత్వం గుణపాఠం నేర్పుతుందని భావిస్తున్నామన్నారు. బాధిత కుటుంబాలకు వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఆర్మీ దుస్తుల్లో వచ్చి అమాయకులను చంపడం దుర్మార్గమైన చర్య అన్నారు.
మరోవైపు ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలను దర్యాప్తు సంస్థలు తాజాగా విడుదల చేశాయి. ఈ ఉగ్రవాదులను ఆసిఫ్ ఫౌజి, సులేమాన్ షా, అబు తాలా గా గుర్తించారు. దాడి సమయంలో ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షుల వివరణల ఆధారంగా రూపొందించబడ్డాయని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications