నేడు అటుకుల బతుకమ్మ.. ఎందుకు జరుపుకుంటారంటే!!
బతుకమ్మ పండుగ మొదలైంది. ఊరువాడ అంతా ఒకటై బతుకమ్మ పండుగను అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. వాడవాడలా మహిళలు అందంగా ముస్తాబై, రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి తొమ్మిది రోజుల పాటు సాగే బతుకమ్మ వేడుకలకు స్వాగతం పలికారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన బతుకమ్మ ఉత్సవాలు ఈరోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.
తొలిరోజు ఎంగిలి బతుకమ్మ లో భాగంగా మహిళలు బతుకమ్మలను పేర్చి సమీపంలో ఉన్న ఆలయాల వద్ద, చెరువు కట్టల వద్ద బతుకమ్మలను పెట్టి సంబరాలు జరుపుకున్నారు. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా అమ్మవారికి నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి ప్రసాదం తయారు తయారుచేసి నైవేద్యంగా పెట్టారు. మహిళలు అందరూ లక్ష్మీదేవుల్లా ముస్తాబై తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పాటలను పాడుతూ సంతోషంగా గడిపారు.

ఇక రెండవ రోజు బతుకమ్మను అటుకుల బతుకమ్మ అంటారు. ఇక అటుకుల బతుకమ్మ రోజు దేవి శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఎంగిలిపూల బతుకమ్మ తర్వాత రోజు సహజంగా పిల్లలు ఎక్కువగా బతుకమ్మను ఆడుకునే వారట. ఈ క్రమంలోనే ఆ రోజు అమ్మవారికి అటుకులు బెల్లం నైవేద్యంగా పెడతారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మకు అమ్మవారికి నైవేద్యంగా సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు సమర్పిస్తారు.
ఈరోజు అటుకులను వాయనంగా అందిస్తారు. తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ వేడుకలలో రోజుకొక రకమైన నైవేద్యాన్ని తయారుచేసి అమ్మవారికి నివేదించి ఆటలు ఆడతారు. పేద ధనిక తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్కరు బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ప్రకృతితో పెనవేసుకున్న పూల పండుగ బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులపాటు చాలా ఘనంగా వాడవాడలా నిర్వహిస్తారు.
మహిళలంతా గౌరీదేవిని తొమ్మిది రోజులపాటు పూజించి అందరూ సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలతో విలసిల్లాలని కోరుకుంటారు. తెలంగాణాకే ప్రత్యేకమైన , విశ్వ ఖ్యాతిని ఆర్జించిన బతుకమ్మ పండుగ బతుకును గుర్తు చేసే పండుగ. తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ.












Click it and Unblock the Notifications