బలగం క్రేజ్: తెలంగాణాలో రాజకీయ 'బలగం' పోస్టర్ల రచ్చ!!
తెలంగాణ సామాజిక నేపథ్యం ఇతివృత్తంతో బంధాలను అనుబంధాలను తెలియజేసేలా కమెడియన్ ప్రియదర్శి కీలక పాత్రలో నటించిన మరొక కమెడియన్ వేణు వెల్దండి అద్భుతంగా తెరకెక్కించిన చిత్రం బలగం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకున్న చిత్రం బలగం ఒక సరికొత్త ట్రెండును సృష్టించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నాయకులు సైతం తమ బలం ఏంటి? తమ బలగం ఏంటి? అన్నది ఆత్మ పరిశీలన చేసుకునే పనిలో పడ్డారు. అంతే కాదు ఎన్నికలకు సమయం దగ్గరకు పడుతున్న తరుణంలో ప్రజల్లోని భావోద్వేగాలను రెచ్చగొట్టే పనిలో పడ్డారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇప్పుడు బలగం సినిమా పైన చర్చ జరుగుతుంది. ఫ్యామిలీ సెంటిమెంట్ తో అందరితో కంటతడి పెట్టించిన బలగం చిత్రం ప్రతి ఒక్కరి మనసులను హత్తుకుంది. కుటుంబం అంటే కలిసి ఉండాలనే భావనను అందరికీ అర్థమయ్యేలా చూపించింది. తెలంగాణ ప్రజలు దీనిని విపరీతంగా ఆదరించడంతో, రాజకీయ నాయకులు ఈ ట్రెండును తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తమ ప్రచారం కోసం సినిమా టైటిల్ తోను, థీమ్ ల తోను రాజకీయ పోస్టర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా రచ్చ చేస్తున్నారు.

పార్టీ కార్యకర్తలే మా బలం.. నియోజకవర్గ ప్రజలే మా బలగం అంటూ బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి నేతలు ఏమాత్రం తగ్గకుండా ఎవరికి వారు ప్రతి జిల్లాలోనూ బ్యానర్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ జిల్లాలోనూ ఈ పోస్టర్లు ప్రదానంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయ్యి. ముఖ్యంగా మెదక్ జిల్లా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఇలాంటి బ్యానర్లను ఎక్కువగా వేస్తూ పబ్లిసిటీ మొదలు పెట్టారు.

ప్రజలలోని భావోద్వేగాలను రెచ్చగొట్టడం కోసం, ప్రజలే తమ బలగం అంటూ అన్ని పార్టీల నాయకులు బలగం సినిమాకు ఉన్న క్రేజ్ ను క్యాప్చర్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. మరి ప్రజలు నిజంగానే వారిని ఆదరిస్తారా? బలగం సినిమా సెంటిమెంట్ రాజకీయాల్లో వర్కవుట్ అవుతుందా లేదా అనేది ముందు ముందు తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications