మూడోరోజు పోలీస్ కస్టడీలో బండి భగీరథ్.. ఆ ఆధారాలతోనే విచారణ!
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో పోలీసు విచారణ మరింత లోతుగా సాగుతోంది. వరుసగా మూడో రోజు కూడా సైబరాబాద్ పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఈ విచారణ సాయంత్రం వరకు కొనసాగనుంది.
సోషల్ మీడియా, వాట్సప్ చాటింగ్ ఆధారంగా విచారణ
ఈ కేసులో మూడు రోజుల పోలీసు కస్టడీ ముగిసే సమయం కావడంతో, సాయంత్రం భగీరథ్‌ను కోర్టు ఎదుట హాజరుపరచి, తర్వాత చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది. పోలీసులు ఇప్పటికే బాధితురాలితో భగీరథ్ మధ్య జరిగిన ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్‌చాట్ చాటింగ్‌ల సంబంధిత ఆధారాలను సేకరించారు. ఈ డిజిటల్ ఆధారాల ఆధారంగానే విచారణను ముందుకు తీసుకెళ్తున్నారు.

పేట్ బషీరాబాద్ ఇన్‌స్పెక్టర్ విజయ్ వర్ధన్ నేతృత్వంలో విచారణ
పేట్ బషీరాబాద్ ఇన్‌స్పెక్టర్ విజయ్ వర్ధన్ నేతృత్వంలో ఈ విచారణ జరుగుతోంది. బాధితురాలు ఫిర్యాదు చేసిన తర్వాత కేసు నమోదు చేయగా ఈ కేసు తెలంగాణ రాజకీయ వర్గాల్లో బాగా చర్చనీయాంశమైంది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఈ కేసు దర్యాప్తులో పూర్తి సహకారం అందిస్తున్నట్లు బండి సంజయ్ తన సోషల్ మీడియా ఖాతాలో ప్రకటించారు. అయితే, ఈ విషయం రాజకీయ ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలకు దారితీసింది.
ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు
పోలీసు వర్గాల ప్రకారం, ఈ కేసు తెలంగాణలో సంచలనం సృష్టించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షించాలని ఆదేశాలు ఇచ్చారు. దీనితో పాటు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని సూచించారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో బాధితురాలి భద్రత మరియు గోప్యతను కాపాడటం ప్రధాన లక్ష్యంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసి,కీలక ఆధారాల సేకరణ
POCSO చట్టం ప్రకారం ఈ కేసు తీవ్రమైనది కావడంతో, ఆధారాలను జాగ్రత్తగా సేకరించి, న్యాయవ్యవస్థకు అందించడంపై దృష్టి సారించారు.ఇక మూడు రోజుల విచారణలో బండి భగీరథ్ నుండి వివరాలు సేకరిస్తున్న పోలీసులు, నిన్న సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసి ఏం జరిగిందో అతని నుండి వివరాలు సేకరించారు. మొయినా బాద్ ఫాం హౌస్ లో గంట పాటువిచారణ జరిపారు.
పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయంలో ఎలాంటి ఒత్తిడికి లొంగకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ప్రజలు ఆశిస్తున్నారు.













Click it and Unblock the Notifications