తెలంగాణ బడ్జెట్.. బభ్రాజమానం భజగోవిందం: బండి సంజయ్, ఈటల సెటైర్లు!!
2023-24 వార్షిక బడ్జెట్ పై బండి సంజయ్, ఈటల రాజేందర్ లు సెటైర్లు వేశారు. తెలంగాణ బడ్జెట్ అంకెల గారడీ బడ్జెట్ అంటూ పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో 2023- 2024 బడ్జెట్ ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ ఎన్నికల ఏడాది బడ్జెట్ కావడంతో బడ్జెట్లో అన్ని వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, రైతు శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్టు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బిజెపి నాయకులు మాత్రం తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

బడ్జెట్ అంతా గందరగోళమే .. బండి సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ ఫ్లాప్ బడ్జెట్ అంటూ పేర్కొన్న బండి సంజయ్, బడ్జెట్ మొత్తం అంకెల గారడీలా కొనసాగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతే కాదు సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో స్పందించిన బండి సంజయ్ తెలంగాణ బడ్జెట్ అంకెల గారడీ బడ్జెట్ మాత్రమే కాదు, గందరగోళమైన బడ్జెట్ అంటూ పేర్కొన్నారు. ఈ బడ్జెట్ ప్రజల స్పందన కరువైన బడ్జెట్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

కేసీఆర్ మాటల్లో బడ్జెట్ పై బండి సంజయ్ సెటైర్లు
ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే నేడు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సరుకు లేదు.. సంగతి లేదని, సబ్జెక్టు లేదు.. ఆబ్జెక్ట్ లేదని, శుష్కప్రియాలు, శూన్య హస్తాలు తప్ప బడ్జెట్లో సామాన్యులకు కలిగే ఎటువంటి లాభం లేదని పేర్కొన్నారు. నేడు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత వట్టిదే డబ్బా అంటూ వ్యాఖ్యానించారు. బభ్రాజమానం భజగోవిందం అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తారని, కెసిఆర్ మాటల్లో తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ పై సెటైర్లు వేశారు బండి సంజయ్.

బడ్జెట్ అంతా అంకెల గారడీనే .. ఈటల రాజేందర్
ఇక మరోవైపు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం 2023- 24 బడ్జెట్ పై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ అంతా అంకెల గారడీ నేనని విమర్శించారు. 70 80% నిధులు, విధులు కావాలని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఇక రుణమాఫీ ప్రకటించారు ప్రభుత్వం పూర్తిగా రుణమాఫీ చేయాలని కోరుతున్నామన్నారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, ఉద్యోగులకు హౌసింగ్ రుణాలు కూడా ఇవ్వడం లేదని ఈటల అభిప్రాయపడ్డారు.

ఈ బడ్జెట్ లో చాలా డిపార్ట్మెంట్లకు కోత : ఈటల రాజేందర్
మధ్యాహ్నం భోజనం వండే వర్కర్లకు మధ్యాహ్న భోజనం వండే వర్కర్లకు దారుణంగా నెలకు వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తారా అంటూ ప్రశ్నించారు. అవి కూడా సకాలంలో ఇవ్వడం లేదని ఈటల రాజేందర్ మండిపడ్డారు. కెసిఆర్ కిట్ సకాలంలో ఇవ్వడం లేదని, కళాశాలలు, పాఠశాలలలో మౌలిక వసతులు సరిగా లేవని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈ బడ్జెట్ లో చాలా డిపార్ట్మెంట్లకు కోత పెట్టారని ఈటల రాజేందర్ ఆరోపించారు.

హరీష్ రావు మీ గొప్ప దార్శనికతను అమల్లో చూపించాలన్న ఈటల
ఆరోగ్యశ్రీ, ఈ హెచ్ ఎస్ నిధులు కూడా విడుదల చేయకపోవడంతో ఆసుపత్రులలో ట్రీట్మెంట్లు జరగడం లేదని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఎలాంటి సహాయం అందించడం లేదని ఈటల అసహనం వ్యక్తం చేశారు. తాను బడ్జెట్ పై విమర్శలు చేయడం లేదని, ఆర్భాటాలు తప్ప మరేమీ బడ్జెట్లో లేవని ఎద్దేవా చేశారు ఈటల రాజేందర్. హరీష్ రావు మీ గొప్ప దార్శనికతను మాటల్లో కాదు అమల్లో చూపించాలని ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications