ఎవరినీ కించపర్చలేదు: మహిళా కమిషన్ ఎదుట హాజరైన బండి సంజయ్, వివరణ
తాను ఎవరినీ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయలేదని భారతీయ జనతా పార్టీ(BJP) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) స్పష్టం చేశారు.
హైదరాబాద్: తాను ఎవరినీ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయలేదని భారతీయ జనతా పార్టీ(BJP) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో శనివారం రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు బండి సంజయ్.
బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులతో కలిసి కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని సుమోటోగా స్వీకరించిన తెలంగాణ మహిళా కమిషన్.. సంజయ్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మార్చి 15న కమిషనర్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించగా.. తనకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున ఆరోజు హాజరుకాలేనని బండి సంజయ్ తెలిపారు.

మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సూచించినట్లుగా మార్చి 18న హాజరవుతానని లేఖలో అభ్యర్థించగా.. అందుకు కమిషన్ సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం కమిషన్ ఎదుట బండి సంజయ్ హాజరై వివరణ ఇచ్చారు.
అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలోని సామెతను మాత్రమే చెప్పానన్నారు. తాను ఎవరినీ కించపర్చలేదని చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నట్లు రెండు పేజీల్లో వివరణ ఇచ్చినట్లు తెలిపారు. ఆయన సమాధానం పట్ల మహిళా కమిషన్ ఏ నిర్ణయం తీసుకుందనేది తెలియాల్సి ఉంది.

కాగా, మహిళా కమిషన్ ముందు బండి సంజయ్ హాజరైన సందర్భంగా పలువురు బీఆర్ఎస్ మహిళా నేతలు ఆయనకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. మరోవైపు, బీజేపీ మహిళా నేతలు కూడా బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications