వారికి ఆసరా ఏది? ఎన్నికలకు ముందు కేసీఆర్ హామీ గుర్తు చేస్తూ బండిసంజయ్ లేఖ
తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. రాష్ట్రంలో 57 సంవత్సరాలు దాటిన అర్హులందరికీ ఆసరా పథకం కింద పింఛన్లు ఇస్తామని ప్రకటించి, ఇప్పటివరకు ఆ హామీని అమలు చేయటం లేదంటూ బండి సంజయ్ లేఖ ద్వారా కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేశారు.

ఆసరా పించన్ల కోసం .. బండి సంజయ్ లేఖ
2018 ఎన్నికల మేనిఫెస్టోలో పేజి నెంబర్ 12, పాయింట్ నెంబర్ 2 లో ఆసరా పింఛన్ల వయోపరిమితిని 65 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలకు తగ్గించినట్లు హామీ ఇచ్చారని పేర్కొన్న బండి సంజయ్ ఆ హామీ గుర్తుందా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రకటనతో అర్హులైన దాదాపు 11 లక్షల మంది కొత్త ఆసరా పింఛన్ల కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.

కొత్త పింఛన్ల కోసం 11 లక్షల దరఖాస్తులు
రాష్ట్రంలో సుమారు 39 లక్షల మంది ఆసరా పింఛన్ దారులు ఉండగా దాదాపు కొత్త పింఛన్ల కోసం 11 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చాయని, తమకు వెంటనే పింఛన్ అందజేసి ఆదుకోవాలని దరఖాస్తుదారులు ఏళ్లతరబడి అధికార పార్టీ నాయకులు, అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోయిందని మండిపడ్డారు. ఆసరా పథకం అంటేనే ఆర్థికంగా చితికి పోయిన పేదలను ఉద్దేశించిన పథకమని పేర్కొన్న బండి సంజయ్ కుటుంబంలో ఆసరా పింఛన్ పొందే వ్యక్తి మరణిస్తే, ఆ కుటుంబంలో ఆసరా పింఛన్ కు అర్హులైన వ్యక్తులు ఉంటే వారికి ఆ పింఛన్ ను కొనసాగించాలని బండి సంజయ్ పేర్కొన్నారు.

ప్రభుత్వ అనాలోచిత చర్య వల్ల రెండు లక్షల మందికి పైగా ఆసరా పింఛన్ కు దూరం: బండి సంజయ్
అలా కాకుండా ఒక కుటుంబానికి ఒకే పింఛన్ అని నిర్ణయించడం అన్యాయమని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ వృద్ధాప్యంలో ఉన్న పేద వారి ఉసురు కొట్టుకునే చర్యేనని బండి సంజయ్ మండిపడ్డారు. ప్రభుత్వ అనాలోచిత చర్య వల్ల రెండు లక్షల మందికి పైగా ఆసరా పింఛన్ కు దూరమయ్యారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

ఒక్కొక్క ఆసరా పింఛన్ లబ్ధిదారులకు ప్రభుత్వం 78, 624 రూపాయలు బకాయి, తక్షణం చెల్లించాలి
ఇక ఈ నేపథ్యంలోనే 2018 డిసెంబర్లో ఇచ్చిన హామీ ఇప్పటి వరకు అమలు కాకపోవడంతో గడిచిన 39 నెలల్లో ఒక్కొక్క ఆసరా పింఛన్ లబ్ధిదారులకు ప్రభుత్వం 78, 624 రూపాయలు బకాయి పడిందని పేర్కొన్నారు. ఈ బకాయిపడ్డ సొమ్మును వృద్ధులకు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ తెలంగాణ శాఖ డిమాండ్ చేస్తోందని బండి సంజయ్ లేఖ ద్వారా స్పష్టం చేశారు.

మార్గాదర్శకాలివ్వండి.. అర్హులకు పించన్లు మంజూరు చెయ్యండి
ఆసరా పథకం అందుకుంటున్న వ్యక్తి మృతి చెందితే ఆ కుటుంబంలో ఉన్న అర్హులకు పింఛను కొనసాగించటం, లేకపోతే మరొక అర్హులైన వారికి పింఛన్ ఇవ్వడం నిరంతర ప్రక్రియగా జరగాలని బిజెపి డిమాండ్ చేస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు. వయోపరిమితి సడలింపు వల్ల కొత్త లబ్దిదారుల సంఖ్య పెరగనున్న కారణంగా దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేయాలని, ఆసరా పింఛన్ల కొత్త దరఖాస్తుల పరిశీలన కు అవసరమైన మార్గదర్శకాలు వెంటనే విడుదల చేయాలని, అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తోంది.












Click it and Unblock the Notifications