కేసీఆర్ ఫామ్ హౌస్‌కు 30గ్రామాలకు వాడుకునే విద్యుత్ ఉచితంగా.. అవసరమా? బండి సంజయ్ సూటిప్రశ్న!!
ప్రజా సంకల్ప పాదయాత్ర నిర్వహిస్తున్న బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వ తీరుపై నిత్యం తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ముందుకు వెళ్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను, కెసిఆర్ పాలనను ప్రజలకు కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా ప్రజాసంకల్పయాత్ర నాలుగో విడత పాదయాత్రలో సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసిన బండి సంజయ్ నువ్వెంత నీ పార్టీ ఎంత అంటూ మండిపడ్డారు. టిఆర్ఎస్ పార్టీకి బీజేపీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు.

పెద్ద పెద్ద ఫాం హౌస్ లకు ఉచిత కరెంట్ దేనికి? ప్రశ్నించిన బండి సంజయ్
అంతేకాదు పెద్దపెద్ద ఫాంహౌస్ లకు ఉచిత కరెంటు ఇస్తున్నారు, వారు ఏమన్నా బిచ్చమెత్తుకుంటున్నారా అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. పాతబస్తీలో విద్యుత్ బకాయిలు ఎందుకు వసూలు చేయడం లేదని ప్రశ్నించిన బండి సంజయ్, కెసిఆర్ ఫాం హౌస్ లో 30 గ్రామాలకు వాడుకునే విద్యుత్ ను ఉచితంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. విద్యుత్ ఉద్యోగులను బీజేపీపై రెచ్చగొట్టే ప్రయత్నం కెసిఆర్ చేస్తున్నారంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశం మిగులు విద్యుత్ దేశంగా ఉందంటే మోడీ వల్లే
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి కెసిఆర్ కారణం కాదా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. మోడీ వల్ల దేశం ఈరోజు మిగులు విద్యుత్ దేశంగా మారిందని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుండి కెసిఆర్ విద్యుత్ ను కొంటున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బండి సంజయ్ విమర్శించారు. సభలో ప్రజా సమస్యలపై కాకుండా ప్రధాని మోడీ ని విమర్శించడం కోసం సమయం వృధా చేశారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ మాటలను కార్యకర్తలు కూడా వినరు.. ఇక దేశ్ కీ నేతనా?
ఇక దేశ్ కి నేత అని చెప్పుకుంటున్న కెసిఆర్ మాటలను సొంత పార్టీ కార్యకర్తలు కూడా వినడం లేదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కెసిఆర్ పెద్ద కుట్రదారుడు అని మండిపడిన బండి సంజయ్ దళితున్ని సిఎం చేస్తానని హామీ ఇచ్చిన కెసిఆర్ ముందు దళితుడిని సిఎం చేయాలని హితవు పలికారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించిన కెసిఆర్ తెలంగాణ భవన్లో అంబేద్కర్ ఫోటో తీసేసి కెసిఆర్ ఫోటో పెట్టుకున్నారు అంటూ ధ్వజమెత్తారు. దమ్ముంటే తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని కెసిఆర్ కు సవాల్ విసిరారు బండి సంజయ్.












Click it and Unblock the Notifications