గుంపుగా రండి.. సింగిల్ గా వస్తాం.. 90స్థానాల్లో గెలుస్తాం: తగ్గేదేలేదంటున్న బండి సంజయ్
రానున్న శాసనసభ ఎన్నికల్లో బిజెపి 90 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్ పైన కేసీఆర్ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజాగోస బీజేపీ భరోసా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లలో పాల్గొంటున్న బండి సంజయ్ వచ్చే ఎన్నికలను లక్షంగా చేసుకుని ప్రజా క్షేత్రంలోకి వెళ్తున్నారు. నిన్న జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లోను, రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో కార్నర్ మీటింగ్ లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు.

90 అసెంబ్లీ స్థానాల్లో.. 10 పార్లమెంట్ స్థానాల్లో గెలుస్తాం
రానున్న శాసనసభ ఎన్నికల్లో బిజెపి 90 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు, టిడిపి కలిసి గుంపుగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నాయని, కానీ బిజెపి ఒంటరిగానే పోటీ చేస్తుందని బండి సంజయ్ తేల్చి చెప్పారు.
ఒంటరిగా బిజెపి పోటీ చేసినా 90 స్థానాల్లో విజయం తమదేనని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో పది లోక్సభ స్థానాలలో గెలుపు ఖాయమని బండి సంజయ్ స్పష్టం చేశారు.

బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం
రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని పేర్కొన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే పింఛన్లు తొలగిస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అదంతా అబద్ధమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మోటార్లకు మీటర్లు పెడతాం రుణాలు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వమేనని తాను సవాల్ విసిరానని, అయితే ఇంతవరకు దానిపైన సమాధానమే ఇవ్వలేదని బండి సంజయ్ విమర్శించారు.
ఇక బిజెపిలో సీఎం అభ్యర్థి ఎవరు అన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. కెసిఆర్ దేశాన్ని దివాలా తీయించి 5.30 లక్షల కోట్ల అప్పు చేశారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ సరఫరాపై బండి సవాల్
రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రగల్బాలు చెబుతున్నారని మరి ఆ విషయానికి కట్టుబడి ఉంటారా అంటూ ప్రశ్నించారు బండి సంజయ్. వ్యవసాయానికి 24 గంటలు కరెంటు ఇస్తున్నట్టు నిరూపిస్తే తను రాజీనామా చేస్తానని లేనిపక్షంలో సీఎం పదవికి రాజీనామా చేస్తారా అంటూ తెలంగాణా సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ చేశారు.
నయీమ్ ఆస్తులను కేసీఆర్ కుటుంబం దోచుకుందని, నయీమ్ డైరీ ఎటు పోయిందని ప్రశ్నించారు బండి సంజయ్.

మిషన్ భగీరథ కోసం కేసీఆర్ కుటుంబం పైపుల కంపెనీలు
ఇక స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి ఇద్దరు డిప్యూటీ సీఎం లుగా పని చేసిన ఏమీ చేయలేదని ఘనపూర్ లో వంద పడకల ఆసుపత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఫైర్ స్టేషన్ తదితర హామీలన్నీ అమలు కాలేదని బండి సంజయ్ గుర్తు చేశారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని టార్గెట్ చేశారు.
మిషన్ భగీరథ కోసం కేసీఆర్ కుటుంబం పైపుల కంపెనీలు పెట్టుకుందని, కోట్ల రూపాయలు దోచుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కెసిఆర్ కుటుంబ పాలనలో రాష్ట్రం నాశనం అయిందని, వచ్చే ఎన్నికలలో కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పడాల్సిన అవసరం ఉందన్నారు బండి సంజయ్.












Click it and Unblock the Notifications