రోడ్డు మీద సెల్ఫీలు దిగితే వారితో సంబంధం ఉన్నట్టా? నిరూపించు కేటీఆర్: బండి సంజయ్!!
రోడ్డుపై ఎవరైనా నాతో సెల్ఫీలు దిగితే, వారికి నాకు సంబంధం ఉందా? టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో బీజేపీపై ఆరోపణలు చేస్తున్న కేటీఆర్‌ను ప్రూవ్ చేయండి అంటూ బండి సంజయ్ కేటీఆర్‌ను టార్గెట్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ల లీకేజీ వ్యవహారం దుమారంగా మారింది. టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ల లీకేజీ వ్యవహారం వెనుక బిజెపి ఉందని బి ఆర్ ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలతో వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. అధికార బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.
బీజేపీ కుట్ర అంటూ ఫోటోలు విడుదల చేసిన కేటీఆర్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వెనుక ఉన్న నిందితుడు రాజశేఖర్ బిజెపి కార్యకర్త అని మంత్రి కేటీఆర్ ఫోటోలు విడుదల చేసి సంచలన ఆరోపణలు చేయడంతో వ్యవహారం ఆసక్తికరంగా మారింది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని, దీని వెనుక ఉన్న వారెవరో తేల్చాలని కేటీఆర్ డిజిపిని కోరారు. కేవలం ప్రభుత్వంపై బురద చల్లే క్రమంలో బిజెపి కుట్ర చేసినట్టుగా అనిపిస్తుందని, అమాయకుల జీవితాలను నాశనం చేయడానికి బిజెపి ఈ పని చేసినట్టుగా అనుమానాలు ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు.

ఫోటోలు దిగితే సంబంధం ఉన్నట్టా? బండి సంజయ్ ప్రశ్న
ఇక ఈ వ్యవహారంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడుతున్నారు. రోడ్డుమీద సిగ్నల్ దగ్గర కూడా సెల్ఫీలు దిగుతామని, సెల్ఫీలు దిగే ప్రతి ఒక్కరితో సంబంధం ఉందని మాట్లాడటం కరెక్ట్ కాదని బండి సంజయ్ భగ్గుమన్నారు. ఫోటో దిగిన ప్రతి ఒక్కరితో తనకు సంబంధం ఉందని మాట్లాడడానికి అకల్ ఉండాలంటూ బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ఇక ఈ వ్యవహారంలో నిందితురాలు రేణుక తల్లి బి ఆర్ ఎస్ సర్పంచ్ అని, ఆమె అన్న బి ఆర్ ఎస్ నేత అంటూ గుర్తు చేసిన బండి సంజయ్ పేపర్ ఎవరికోసం లీక్ అయిందో చెప్పాలన్నారు.

ఆధారాలుంటే నిరూపించాలని బండి సంజయ్ సవాల్
నోటికొచ్చినట్టు మాట్లాడటానికి సిగ్గుండాలని పేర్కొన్న బండి సంజయ్ బిజెపిని అనడానికి ఆధారాలు ఉంటే బయట పెట్టాలంటూ సవాల్ విసిరారు. అసలు పేపర్ ను లీక్ చేసింది బిఆర్ఎస్ అని, ఇప్పుడు బిజెపిని బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ బండి సంజయ్ మండిపడ్డారు. టిఎస్పిఎస్సిలో నమ్మిన వాళ్లు మోసం చేశారంటే చైర్మన్ గా నువ్వెందుకు అక్కడ అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించడానికి ఇబ్బంది ఏమిటో చెప్పాలంటూ ప్రశ్నించిన బండి సంజయ్ ఇదంతా కేసీఆర్ కొడుకు ఆడుతున్న డ్రామా అంటూ మండిపడ్డారు.

మంత్రి కేటీఆర్ రాజీనామా చెయ్యాలని బండి సంజయ్ డిమాండ్
అంతేకాదు అనుచిత వ్యాఖ్యలతో కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. దొంగ నోటిఫికేషన్ లు ఇచ్చి బండి సంజయ్ ఆపాడని ప్రచారం చేస్తారని, వినే వాళ్ళు ఉంటే ప్రీతి చావుకు కూడా నేనే కారణమని చెబుతారని బండి సంజయ్ విమర్శించారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో కేటీఆర్ రాజీనామా చేయాలని, కేటీఆర్ రాజీనామా చేసే వరకు వదిలిపెట్టేది లేదని బండి సంజయ్ పేర్కొన్నారు. కేసీఆర్ మంత్రి కేటీఆర్ ను భర్తరఫ్ చేస్తావా లేదా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications