"సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే.. రూ.10 లక్షలు"
గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మూడు దశల్లో డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఈ నెల 27 నుంతి తొలి విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తామని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అయితే రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరచిన అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే ప్రత్యేకంగా రూ. 10 లక్షలు ఇస్తానని ఆయన ప్రకటించారు. కరీంనగర్ ఎంపీ సీటు పరిధిలోని గ్రామాలకు అందజేస్తానని తెలిపారు. ఈ మేరకు మాట్లాడుతూ.." ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 5 లక్షలు ఇస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం మాటతప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నయా పైసా నిధులు లేవు. నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. ఈ ఎన్నికలు కేంద్ర నిధుల కోసమే. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి" అని బండి సంజయ్ స్పష్టం చేశారు.

అలాగే "బీజేపీ ఓసారి మాట ఇస్తే తప్పదు. మీ బండి సంజయ్ ఎన్నడూ చేసేదే చెబుతాడు. చెప్పేదే చేస్తాడు.. ఇచ్చిన మాట ప్రకారం ఈ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులుగా ఏకగ్రీవం చేస్తే ఆ గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున ప్రోత్సాహక నిధులిస్తానని మాట ఇస్తున్నా" అని కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో గ్రామ పంచాయతీలకు నయాపైసా ఇవ్వలేదన్నారు. ఇక గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలోనూ గ్రామ పంచాయతీల అభివృద్ధికి పైసా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పాలనలో సర్పంచులు అప్పు తెచ్చి మరీ గ్రామపంచాయతీలను అభివృద్ధి చేశారని.. ఆ తర్వాత బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు బండి సంజయ్.












Click it and Unblock the Notifications