బతుకమ్మ సంబరాలకు వేళాయే.. ఏ రోజు ఏ పేరు, ఏ నైవేద్యాలు.. తెలుసుకోండి!
తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలు ఈ ఏడాది అక్టోబర్ 10 నుంచి 18 వరకు వైభవంగా జరుగనున్నాయి. దసరాకు ముందు తొమ్మిది రోజుల పాటు మహిళలు పూలతో బతుకమ్మను అలంకరించి ఆడి పాడుతారు. తంగేడు, గునుగు, తామర, బంతి, చామంతి, కట్ల, సీతజడ వంటి సహజ పూలతో బతుకమ్మను పేర్చి ఆరాధించే ఈ సంప్రదాయం ప్రపంచంలోనే ప్రత్యేకం. ప్రకృతిని పూజించే విశేషమైన పండుగ బతుకమ్మ.
రోజువారీ బతుకమ్మ పేర్లు, నైవేద్యాలు:
ఈ సంవత్సరం అక్టోబర్ 10 న ఎంగిలిపూల బతుకమ్మను జరుపుకుంటారు. బియ్యం పిండి, నువ్వులు నైవేద్యంగా సమర్పిస్తారు.
అక్టోబర్ 11 న అటుకుల బతుకమ్మను జరుపుకుంటారు. చప్పిడి పప్పు, బెల్లం, అటుకులు బతుకమ్మకు నైవేద్యంగా నివేదిస్తారు.
అక్టోబర్ 12 న ముద్దపప్పు బతుకమ్మను మహిళలు జరుపుకుంటారు. ముద్దపప్పు, బెల్లం, పాలు బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు.

అక్టోబర్ 13 న నానబియ్యం బతుకమ్మను ఘనంగా జరుపుకుంటారు, నానబెట్టిన బియ్యం, బెల్లం, పాలు నైవేద్యం పెడతారు.
అక్టోబర్ 14 న అట్ల బతుకమ్మ జరుపుకుంటారు. గోధుమ లేదా బియ్యం అట్లు అమ్మవారికి నైవేద్యంగా పెడతారు.
అక్టోబర్ 15 న అలిగిన బతుకమ్మ. ఈరోజు ఎవరూ బతుకమ్మ ఆడరు. కనుక నైవేద్యం లేదు
అక్టోబర్ 16 న వేపకాయల బతుకమ్మ జరుపుకుంటారు. బియ్యం పిండి వేపకాయలు చేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదిస్తారు.
అక్టోబర్ 17న వెన్నముద్ద బతుకమ్మను నిర్వహిస్తారు. నువ్వులు, వెన్నముద్ద, బెల్లం అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.
అక్టోబర్ 18 న సద్దుల బతుకమ్మ.. ఇది చివరి రోజు.. పెరుగన్నం, పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం ఇలా ఐదు రకాల నైవేద్యాలు సమర్పిస్తారు.
సద్దుల బతుకమ్మ రోజున తల్లి, పిల్ల బతుకమ్మలు పేర్చి పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటారు. మహిళలు కొత్త బట్టలు ధరించి వృత్తాకారంలో ఆడుతూ పాటలు పాడతారు. చివరగా బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేయటం సంప్రదాయం. ఈ పండుగ తెలంగాణ మహిళల ఐక్యత, ప్రకృతి పట్ల గౌరవం, సామూహిక సంతోషాన్ని ప్రతిబింబిస్తుంది. పల్లెల్లోనూ, నగరాల్లోనూ ఒకే ఉత్సాహంతో పేద ధనిక తారతమ్యం లేకుండా ఈ పండుగను జరుపుకుంటారు.













Click it and Unblock the Notifications
