తెలంగాణ పూల జాతర షురూ -నేడే ఎంగిలిపూల బతుకమ్మ!
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ నేటి నుంచి ప్రారంభమైంది. ఆడపడుచులందరూ కలిసి సంబరంగా జరుపుకునే ఈ వేడుక ప్రకృతిని ఆరాధిస్తూ, కుటుంబ అనుబంధాలను గుర్తు చేస్తూ సాగుతుంది. తెలంగాణకే ప్రత్యేకమైన ఈ పూల ఉత్సవం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
బతుకమ్మ వేడుకలు పితృ అమావాస్య నాడు ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు సాగుతాయి. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులూ మహిళలు ప్రకృతిలో దొరికే రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆడి పాడి, భక్తితో గౌరీదేవిని పూజిస్తారు. అందరూ సుఖశాంతులతో, సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు. నేడు ఆశ్వయుజ అమావాస్య అయిన పితృ అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మతో పండుగకు శ్రీకారం చుట్టారు.

తొలి రోజు మహిళలు చక్కగా ముస్తాబై గునుగు, తంగేడు, కట్ల, మొల్ల, సీత జడలు, రుద్రాక్ష, మందార, పారిజాతం, కమలం, తామర, గన్నేరు వంటి పూలతో బతుకమ్మలను అందంగా పేర్చుతారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా జానపద పాటలు పాడుతూ ఎంగిలిపూల బతుకమ్మకు స్వాగతం పలుకుతారు.
ఎంగిలిపూల బతుకమ్మ పేరు ఎలా వచ్చిందంటే... ఒక రోజు ముందే పూలను సేకరించి ఉంచి, ఆ తర్వాత పేర్చడం వల్ల లేదా తిన్న తర్వాత పేర్చడం వల్ల ఈ పేరు వచ్చిందని పెద్దలు చెబుతారు. తొలి రోజు ఉదయం ఇంట్లోనే బతుకమ్మను పూజిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి ప్రసాదం తయారు చేస్తారు. సాయంత్రం సమీప గుడులు లేదా చెరువుల వద్ద మహిళలంతా గుమికూడి సమిష్టిగా వేడుకలు జరుపుకుంటారు.
బతుకమ్మ కేవలం పూల అలంకరణ మాత్రమే కాదు. ఇది తెలంగాణ గ్రామీణ జీవన విధానాన్ని, స్త్రీల శక్తిని, ప్రకృతి పట్ల గౌరవాన్ని చాటి చెప్పే ఉత్సవం. జానపద గీతాలు, రంగురంగుల పూలు, అందరూ కలిసి ఆది పాడటం ఈ పండుగను మరింత విశేషంగా మారుస్తుంది. ప్రతి రోజు వేర్వేరు పూలతో వేర్వేరు రకాల బతుకమ్మలు పేర్చడం, ప్రత్యేక పాటలు పాడడం సంప్రదాయం.
ఈ పండుగ ద్వారా తెలంగాణ మహిళలు తమ సంస్కృతిని తరతరాలుగా కాపాడుకుంటున్నారు. ప్రకృతితో మమేకమై, ఐక్యతను పెంపొందించుకుంటూ సాగే ఈ బతుకమ్మ సంబరాలు తెలంగాణకు తలమానికంగా నిలుస్తున్నాయి. నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు రాష్ట్రం అంతా పూల సౌరభాలతో, పాటలతో, భక్తితో నిండిపోనుంది. పూల జాతర ఎంగిలి పూల బతుకమ్మతో మొదలవుతుంది.













Click it and Unblock the Notifications
