సింగరేణిపై ఏ గద్దని, ఏ పెద్దలను వాలనీయను : Bhatti Vikramarka
రాష్ట్రానికి గర్వకారణమైన సింగరేణి కాలరీస్ (Singareni Collieries) సంస్థను లక్ష్యంగా చేసుకుని ఇటీవల రోజులుగా కావాలని కట్టుకథలు, పిట్టకథలు, విషపూరిత రాతలతో తప్పుడు ప్రచారం జరుగుతోందని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తీవ్రంగా మండిపడ్డారు. పెట్టుబడులు, కుట్రలు, అసత్య కథనాలతో ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు.
మీడియాతో మాట్లాడుతూ, "సింగరేణిపై వస్తున్న ఈ కథనాల వెనుక ఏ రాబందులు, ఏ గద్దలు, ఏ దోపిడీదారుల ప్రయోజనాలు దాగున్నాయో ప్రజలు గమనించాలి. ఏ నినాదం వెనుక ఎవరి లాభం ఉందో, తొలి పలుకుల రాతల వెనుక ఎవరి ఆజెండా ఉందో బయటపడాలి" అని భట్టి వ్యాఖ్యానించారు. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన సింగరేణిపై నిరాధార ఆరోపణలు చేయడం తీవ్రంగా ఖండించారు.

నిజాలు ప్రజలకు చెప్పాల్సిన సమయం వచ్చింది
సింగరేణిపై జరుగుతున్న అడ్డగోలు ప్రచారంపై నిజానిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని భట్టి స్పష్టం చేశారు. "పత్రికలే కాదు... కొందరు నాయకులు, సోషల్ మీడియాలోనూ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలంటే అవసరమైన డాక్యుమెంట్లన్నీ అందించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. తప్పుడు ప్రచారం చేసే వారి అసలు ముఖాలు బయటపడతాయి" అని హెచ్చరించారు.
2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన టెండర్లపై విచారణకు సిద్ధం.. హరీష్‌రావు లేఖ రాయాలనుకుంటే నాకు రాయండి.. వాళ్లకు, వీళ్లకు లేఖ రాసి ఎందుకు ఇబ్బంది పెడతావ్.. ఆ లేఖ ఏదో నాకే రాస్తే.. నేనే విచారణకు ఆదేశిస్తా. అడ్డగోలుగా ఏదిపడితే అది రాస్తే నడవదు.. నేను ఆస్తులు సంపాదించుకునేందుకు రాలేదు.. సమాజంలో మార్పు కోసం వచ్చా.. నా పాదయాత్ర సమయంలో కూడా సింగరేణి కోసం పోరాడా.. సింగరేణిపై ఏ గద్దని, ఏ పెద్దలను వాలనీయను.. బొగ్గు బావులు తెలంగాణకు ఎంత అవసరమో నాకు తెలుసు-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సైట్ విజిట్ నిబంధన కొత్తది కాదు
టెండర్ల విషయంలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని భట్టి కొట్టిపారేశారు. 2018లోనే కోల్ ఇండియా టెండర్ డాక్యుమెంట్‌ను తయారు చేసి పంపించిందన్నారు. సైట్ విజిట్ తప్పనిసరి అన్న నిబంధనను కోల్ ఇండియానే పెట్టిందినే విషయాన్ని వెల్లడించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ జోక్యం లేదని వివరించారు. హరీష్‌రావు లేఖ రాయడం మంచిదేనని, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విచారణ చేస్తామనడం కూడా స్వాగతించదగ్గ విషయమేనని చెప్పారు. అన్ని నిర్ణయాలను తాము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. దర్యాప్తు జరిగితే నిజాలు మరింత స్పష్టంగా బయటపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న నిబంధనలే
సైట్ విజిట్ తప్పనిసరి అనే నిబంధన ఒక్క సింగరేణికే పరిమితం కాదని భట్టి స్పష్టం చేశారు. రైల్వే శాఖలో, హిందుస్థాన్ కాపర్స్, గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీస్ లిమిటెడ్, గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సెంట్రల్ మైనింగ్ డిజైనింగ్ అండ్ ప్లానింగ్ వంటి అనేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో కూడా ఇదే నిబంధన అమల్లో ఉందని గుర్తుచేశారు.
తప్పుడు ప్రచారానికి గట్టి చెక్
సింగరేణిని దెబ్బతీయాలనే ఉద్దేశంతో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి గట్టి చెక్ పెడతామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. "నిజాలు, డాక్యుమెంట్లే మా ఆయుధాలు. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తాం. ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్ఠను కాపాడుకుంటాం" అని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications