కవిత పాదయాత్ర వెనుక బిగ్ రీజన్.. బడా ప్లాన్!
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు తెలంగాణ జాగృతి తరఫున జనం బాట కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువ కావాలని ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సమాజంలో జాగృతి తీసుకురావడంతో పాటు తెలంగాణ జాగృతి సంస్థను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం దిశగా కవిత చేస్తున్న పాదయాత్ర వెనుక బిగ్ రీజన్, బడా ప్లాన్ ఉందని ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా క్షేత్రంలో చరిష్మా కోల్పోయిన బీఆర్ఎస్
రాజకీయాలలో కవితను తక్కువగా అంచనా వేయలేమని, కెసిఆర్ రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న కవిత రాజకీయంగా ఎదగడానికి పాదయాత్రను ఎంచుకోవడం ఒక కీలక అడుగు అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో గత ఎన్నికలలో ఓటమిపాలైన బీఆర్ఎస్, ఆ తరువాత అనేక రాజకీయ పరిణామాలతో కుదేలైంది. అప్పటినుంచి ఇప్పటివరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నప్పటికీ పెద్దగా ప్రజాక్షేత్రంలో మాత్రం, ప్రజా సమస్యల కోసం పోరాటం చేసే పార్టీగా పేరు తెచ్చుకోలేకపోయింది.

తెలంగాణ జాగృతి పేరు మీద కవిత రాజకీయం
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కావడం, కేటీఆర్ పార్టీని బలోపేతం చేయడానికి సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లలేకపోవడం వంటి కారణాలు తెలంగాణ సమాజంలో బీఆర్ఎస్ పార్టీ ప్రాభవాన్ని బాగా తగ్గించాయి. ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చి తెలంగాణ జాగృతి పేరు మీద రాజకీయాలు చేస్తున్న కవిత పాదయాత్ర చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించుకోవడం కీలకంగా మారింది.
ప్రజా క్షేత్రంలో పాదయాత్ర.. జనం బాట పేరుతో కవిత
ప్రజల సమస్యల కోసం పోరాటం చేయాలని, తెలంగాణ ప్రజలలో ప్రస్తుత పాలకుల వైఫల్యాల పైన జాగృతిని తీసుకురావాలని ప్రయత్నం చేయడం తెలంగాణ వ్యాప్తంగా ప్రజల దృష్టిని ఒక్కసారిగా కవిత పైకి మళ్ళించింది. ఇది కవిత రాజకీయ ఎదుగుదలకు ఈ పాదయాత్ర భూమిక అవుతుంది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవుతారా? చర్చ
ఇక ఇదే సమయంలో గతంలో పాదయాత్రలు చేసిన వారంతా ముఖ్యమంత్రులు అయ్యారు అన్న చర్చ కూడా సాగుతుంది. ఈ క్రమంలోనే కవిత కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అన్న చందంగా పాదయాత్ర చేసి భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలి అన్న సంకల్పంతో ఇప్పటి నుంచే వడివడిగా అడుగులు వేస్తుంది అన్న అభిప్రాయం కూడా కొందరిలో వ్యక్తమవుతుంది.
కవిత పాదయాత్ర వెనుక బిగ్ రీజన్స్ ఇవే
పాదయాత్ర ద్వారా ప్రజలకు తన పట్ల ఉన్న ఆదరణ ఏ విధంగా ఉందో తెలుసుకోవడం, తెలంగాణ జాగృతిని బలోపేతం చేయడం, అన్ని జిల్లాలలోనూ తనతో కలిసి వచ్చే వాళ్ళు ఎవరు అనేది అంచనా వేసుకోవడానికి కవిత ఈ పాదయాత్రను ఉపయోగిస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా కేటీఆర్ కంటే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న కవిత పాదయాత్ర ఆమెను రాజకీయంగా ఎటువైపు కి తీసుకు వెళుతుంది అనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications