వేములవాడ బీజేపీలో బిగ్ ట్విస్ట్.. వికాస్ రావు వర్సెస్ తుల ఉమ.. పోటీలో ఎవరంటే?
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ఎంపికలో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. వేములవాడ బిజెపి అభ్యర్థిగా తులా ఉమని ప్రకటించిన అధిష్టానం తాజాగా చెన్నమనేని వికాస్ రావుకు టికెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా చెన్నమనేని వికాస్ రావు పేరును అధిష్టానం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. కాగా వేములవాడ బిజెపి అభ్యర్థిగా తుల ఉమను ఇప్పటికే అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే, కాగా నిన్న తుల ఉమా తరపున, ఆమె అనుచరులు నిన్న నామినేషన్ దాఖలు చేశారు.

ఈరోజు తుల ఉమా నామినేషన్ వేశారు. తులా ఉమనే అభ్యర్థి అని ప్రచారం జరుగుతున్న వేళ ఊహించని విధంగా షాక్ ఇస్తూ ప్రస్తుతం తుల ఉమా స్థానంలో చెన్నమనేని వికాస్ రావుకు టికెట్ కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం శ్రేణుల మధ్య గందరగోళానికి కారణంగా మారింది. తాజా ప్రకటనతో వేములవాడ బిజెపి అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు చెన్నమనేని వికాస్ రావు వేములవాడ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేయనున్నారు.
వికాస్ రావుకు బీఫామ్ అప్పగించేందుకు, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హెలికాప్టర్ లో వేములవాడకు రానున్నారు. మరి ప్రస్తుతం తుల ఉమ కూడా నామినేషన్ వేసి ఎన్నికల బరిలో ఉండడంతో, వికాస్ రావు, తుల ఉమ ల మధ్య ఫైనల్ గా ఎవరు బరిలో ఉంటారు అన్నది ఆసక్తిగా మారింది.
అయితే వికాస్ రావునే బరిలో ఉంటారని, అధిష్టానం తులా ఉమను బుజ్జగించే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా అధికార పార్టీ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఇప్పటికే ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళుతుంటే, బిజెపి మాత్రం ఇంకా అభ్యర్థుల విషయంలో క్లారిటీ లేకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications