కేసీఆర్‌పై బీహార్ సీఎం ప్రశంసలు: నితీష్‌ను కూర్చోవాలంటూ తెలంగాణ సీఎం
పాట్నా: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. కష్టపడి తెలంగాణ సాధించిన వ్యక్తిని ప్రజలు ఎప్పటికీ వదులుకోరని అన్నారు. ఎవరేం మాట్లాడినా పట్టించుకోవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్కు సూచించారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను కొందరు విమర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

కేసీఆర్ సర్కారుకు నితీష్ అభినందనలు
తాము చేయని పనులు కూడా చేసినట్లు కొందరు ప్రచారం చేసుకుంటారని పరోక్షంగా కేంద్రాన్ని విమర్శించారు నితీష్ కుమార్. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని చాలా కాలం నుంచి అడుగుతున్నా.. కేంద్రం పట్టించుకోవడంలేదన్నారు బీహార్ సీఎం నితీశ్ కుమార్. ప్రత్యేక హోదా లభించి ఉంటే రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందేదని అన్నారు. గాల్వాన్ అమర వీరులు, సికింద్రాబాద్ అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థికసాయం అందజేయడాన్ని నితీశ్ అభినందించారు. తెలంగాణలో చాలా మంది బీహార్ కార్మికులు పని చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు నితీష్.

తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలంటూ నితీష్ కుమార్
తెలంగాణ తరహాలోనే ఇతర రాష్ట్రాలు కూడా అమరుల కుటుంబాలకు అండగా ఉండాలని నితీశ్ కుమార్ పిలుపునిచ్చారు. మరోవైపు, సమాఖ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. బీహార్ కు కేంద్రం నుంచి రావాల్సిన సాయం రాకపోగా.. మరింత భారం పడుతోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాలు ఒకదానికొకటి సాయం చేసుకోవాలని తేజస్వీ అభిప్రాయపడ్డారు. సమాజంలో వ్యాప్తి చెందుతున్న ద్వేషాన్ని తగ్గించడం పెను సవాలుగా మారిందన్నారు.

ఇబ్బంది పడిన నితీష్ కుమార్.. కూర్చోవాలంటూ కేసీఆర్
సీఎం కేసీఆర్ బీహార్ పర్యటనలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో కలిసి కేసీఆర్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ రాజకీయాలపై మాట్లాడటంతోపాటు బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం కలిసి పని చేస్తామని చెప్పారు.
ఈ క్రమంలో మీడియా పలు ప్రశ్నలు సంధించింది. కూటమి, పొత్తుల అంశాలను పదే పదే ప్రస్తావించింది. నితీష్ కుమార్ ప్రధాని అభ్యర్థిగా ఉండడానికి ఒప్పుకుంటారా ? లేక ఎవరుంటారని ప్రశ్నించారు. దీంతో వివిధ పార్టీలతో తాము సమవేశాలు జరుపుతామని అప్పుడే నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. కాగా, నితీష్‌కు సంబంధించిన విషయాలను మీడియా ప్రస్తావించింది.
దీంతో నితీష్ కొంత ఇబ్బంది పడ్డారు. వెంటనే లేచి.. మీడియా సమావేశం ముగిసిందన్నారు. ఆ సమయంలో సీఎం కేసీఆర్ కూర్చొనే ఉన్నారు. మీరు కూర్చొండి.. అంటూ నితీష్‌ను అభ్యర్థించారు. అయినా.. కొద్దిసేపు అలాగే నిలబడ్డారు. ఇలా రెండు, మూడు సార్లు జరిగింది. చివరకు రాజకీయాలను మాట్లాడను అంటూ సీఎం కేసీఆర్ చెప్పడంతో సీఎం నితీష్ కూర్చొన్నారు.












Click it and Unblock the Notifications