బీజేపీ తెలంగాణ ఎన్నికల ప్రత్యేక కమిటీలో ఏపీ నేతలకు చోటు
హైదరాబాద్: రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కసరత్తులు చేస్తోంది. తాజాగా, ఎన్నికల కార్యాచరణలో భాగంగా 26 మందితో ప్రత్యేక కమిటీని నియమించింది బీజేపీ. ఐదుగురు కేంద్రమంత్రులు సహా వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ ముఖ్య నేతలతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ తోపాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ముఖ్య నేతలను భాగస్వామ్యం చేసి కీలక బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలను ఈ ప్రత్యేక కమిటీలో సభ్యులుగా నియమించింది. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డికి ఈ కమిటీలో స్థానం కల్పించింది. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలను సమన్వయం చేసుకోవడం, అభ్యర్థుల ఎంపికలో తోడ్పాటు అందించడం, జాతీయ నేతల బహిరంగ సభల నిర్వహణలో సమన్వయం చేయడంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుంది.

అంతేగాక, ప్రజల్లోకి వెళ్లేందుకు అవసరమైన కార్యక్రమాల్లో తోడ్పాటు అందించడం, హైదరాబాద్, తెలంగాణలోని ఆయా జిల్లాల ఓటర్లు లక్ష్యంగా పనిచేయనుంది. కమిటీలోని 26 మంది నేతలు తెలంగాణలో ఎన్నికలు ముగిసే వరకు కూడా పూర్తి సమయాన్ని కేటాయించి ఎన్నికల్లో అప్పగించిన బాధ్యతలను నిర్వహించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఈ కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వం కేంద్రమంత్రులు, పార్టీ జాతీయ నాయకత్వంతో కలిసి పనిచేయనున్నారు. అక్టోబర్ 5వ తేదీన ఈ 26 మంది కమిటీతో ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రత్యేకంగా సమావేశమై కార్యాచరణను వివరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 6వ తేదీన హైదరాబాద్‌లో జరిగే బీజేపీ విస్తృతస్థాయి కౌన్సెల్ సమావేశంలో కూడా వీరిని భాగస్వామ్యం చేయనున్నారు.
మరోవైపు, అక్టోబర్ మొదటి వారంలో మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభలు నిర్వహించతలపెట్టిన విషయం తెలిసిందే. దీంతో అందుబాటులో ఉన్న నేతలు హైదరాబాద్ చేరుకుని అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించాలని సూచించినట్లు తెలిసింది. బీజేపీ అధిష్టానం నిర్ణయం మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ ఈ 26 మంది ప్రత్యేక కమిటీ సభ్యులకు రాతపూర్వకంగా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications