బండి సంజయ్ అరెస్ట్ పై బిజెపి హెబియస్ కార్పస్ పిటిషన్.. అనుమతిచ్చిన హైకోర్టు
పదవతరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు సంబంధించి బిజెపి నేతలు తెలంగాణ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. బిజెపి దాఖలు చేసిన పిటిషన్ కు అనుమతినిచ్చిన తెలంగాణ హైకోర్టు రేపు ఉదయం ఈ పిటిషన్ పై విచారణ చేపడతామని స్పష్టం చేసింది.
బండి సంజయ్ అరెస్టు విషయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని, ఆయనను అక్రమంగా అరెస్టు చేశారని బిజెపి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు కూడా కనీస అరెస్టుకు సంబంధించిన కారణాలు చెప్పకుండా బండి సంజయ్ ను అరెస్ట్ చేసినట్లుగా బిజెపి నేతలు తమ పిటీషన్ లో పేర్కొన్నారు. అయితే కోర్టు రేపు ఉదయం పిటిషన్ పై విచారణ జరపనున్నట్టు వెల్లడించింది.

ఇదిలా ఉంటే జఫర్ గడ్ లో ఉన్న బండి సంజయ్ ను వరంగల్ కోర్టుకు తీసుకురానున్నారు. ఇక ఇదే క్రమంలో బండి సంజయ్ అరెస్టుపై వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్ నిర్వహించనున్న నేపథ్యంలో ఆయన ఈ కేసుకు సంబంధించి ఎటువంటి విషయాలను ప్రస్తావిస్తారు అన్నది ఆసక్తిగా మారింది. పేపర్ లీకేజీ నిందితుడు ప్రశాంత్ తో బండి సంజయ్ సంబంధాలు, వారిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్, ఫోన్ కాల్స్ తదితరాలను లోతుగా పరిశీలిస్తున్న పోలీసులు ఇప్పటికే పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి బండి సంజయ్ కుట్ర ఉన్నట్టుగా పలు కీలక ఆధారాలను సేకరించారు.
ఈ క్రమంలోనే బండి సంజయ్ ను అరెస్ట్ చేసి, ఈ కేసులో నిందితుల జాబితాలో చేర్చారు. కాగా బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా బిజెపి నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. హోం మంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఆరా తీస్తూ, తామున్నామని పార్టీ శ్రేణులకు భరోసా ఇస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా తాజా పరిణామాలతో భవిష్యత్ కార్యాచరణకు బీజేపీ సిద్ధం అవుతుంది.












Click it and Unblock the Notifications