వారితో ఫొటోలు, మాపై దాడులా?: కొత్త ప్రభాకర్‌పై కత్తి దాడి ఘటనపై రఘునందన్ రావు ఆగ్రహం
హైదరాబాద్: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో బీఆర్ఎస్ ఎంపీ, ఆ పార్టీ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడికి తానే కారణమని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరగడం దురదృష్ణకరమని అన్నారు. దాడికి పాల్పడిన నిందితుడు ఓ ఛానల్ రిపోర్టర్ అని వెబ్‌సైట్‌లో ఉందన్నారు.
ఫేస్‌బుక్ పేజీలో కాంగ్రెస్ నేతలతో నిందితుడు ఉన్న ఫొటోలు ఉన్నాయి. నిందితుడు ఏ పార్టీ వ్యక్తి అనేది సీపీ స్పష్టంగా చెప్పి ఉంటే బాగుండేది. ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అనవసరంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని రఘునందన్ రావు మండిపడ్డారు.

తప్పు చేసిన వాళ్లు మా కార్యకర్తలైతే నేనే తీసుకొచ్చి అప్పగిస్తాను. దళితబంధు రాలేదనే ఆవేదనతోనే ఆవేదనతోనే దాడి చేశాడని మీడియాలో వచ్చింది. పోలీసుల విచారణలో నిజానిజాలు తెలుస్తాయి. సోషల్ మీడియాల్లో వచ్చే వార్తలు కార్యకర్తలు నమ్మొద్దు అని రఘునందన్ రావు అన్నారు. దాడి తర్వాత బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు.
దిపాయన్ పల్లి గ్రామానికి చెందిన కార్యకర్త స్వామిని పోలీసులు మఫ్టీలో ఎత్తుకెళ్లారని రఘునందన్ రావు ఆరోపించారు. దుబ్బాక బీజేపీ కార్యాలయంపై దాడి చేశారని.. కొంతమంది కౌన్సిలర్లు తమ సిబ్బందిపై దాడి చేశారని తెలిపారు. అయితే, పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారన్నారు. బీజేపీ నాయకుల ఇళ్లు, దుకాణాలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమలులో ఉంటే రఘునందన్ రావు దిష్టిబొమ్మను దహనం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
నిందితుడు రాజు.. దళితబంధు రాలేదనే ఆవేదనతోనే ఘటనకు పాల్పడ్డాడు అని కొన్ని మీడియాలో వస్తోంది. కార్యకర్తలు సంయమనం పాటించండి. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాన్ని నమ్మొద్దు అని రఘునందన్ రావు తెలిపారు. రాజు మద్యం మత్తులో ఉన్నాడు, కుటుంబసభ్యులతో కలహాలు ఉన్నాయని మీడియాలో వస్తోందన్నారు.
బీజేపీ కండువా కప్పినట్లు ప్రచారం జరుగుతున్న వ్యక్తి నిందితుడు కాదని చెప్పారు. పొడేటి నర్సింహులు ఆదివారం బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరాడని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. సిద్దిపేట సీపీపై వారం క్రితమే డీజీపీకి ఫిర్యాదు చేశాను. సీఎం అడుగులకు మడుగులు నొక్కుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాణేనికి చెరోవైపు అని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications