కొడుకు మృతి విషయం ఉదయం దాకా దత్తన్నకు తెలియదు! ఆ బాధ నాకు తెలుసు: నందమూరి హరికృష్ణ
సికింద్రాబాద్: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఒక్కగానొక్కు తనయుడు వైష్ణవ్ (21) గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి గం.10.45 ని.లకు గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో భోజనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అతనిని వెంటనే ముషీరాబాద్‌లోని గురునానక్ కేర్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ రాత్రి పన్నెండున్నర గంటలకు మృతి చెందారు. వైష్ణవ్ ఎంబీబీఎస్ మూడో ఏడాది చదువుతున్నారు. కొడుకు మృతితో దత్తాత్రేయ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వైష్ణవ్ మృతదేహాన్ని బంధువుల సందర్శనార్థం ఇంటి వద్ద ఉంచారు. కడసారి చూపు కోసం బంధువులు, సన్నిహితులు, మిత్రులు తరలి వచ్చారు.

రాత్రి చనిపోతే తెల్లవారు వరకు దత్తన్నకు తెలియదు
వైష్ణవ్ మృతిని తండ్రి బండారు దత్తాత్రేయకు తెలియకుండా బుధవారం తెల్లవారుజాము వరకు జాగ్రత్తపడ్డామని, ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పని చేయాల్సి వచ్చిందని దత్తాత్రేయ బంధువులు చెబుతున్నారు. అర్ధరాత్రి పన్నెండుంపావుకు వైష్ణవ్ మృతి చెందినట్లు ప్రకటించగా దత్తాత్రేయకు విషయం చెబితే ఏమవుతుందోననే ఆందోళనతో వారు ఉదయం వరకు చెప్పలేదు. మృతదేహాన్ని ఆసుపత్రిలోనే ఉంచి, ఇంటికి తీసుకు వెళ్లారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో రోజులాగే నిద్రలేచిన దత్తాత్రేయ, విషయం తెలుసుకొని కన్నీరుమున్నీరయ్యారు.

ఆ బాధ నాకు తెలుసు.. హరికృష్ణ
చేతికి అందివచ్చిన కొడుకు దూరమైతే ఓ తండ్రి పడేబాధ తనకు తెలుసునని, నందమూరి హరికృష్ణ అన్నారు. ఆయన ఉదయం దత్తన్న ఇంటికి వచ్చి ఆయనను పరామర్శించారు. కొడుకును పోగొట్టుకున్న ఆయనను కలవాల్సి వస్తుందని అనుకోలేదన్నారు.

పలువురు నాయకుల పరామర్శ
వైష్ణవ్ మృతి పట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫోన్ చేసి దత్తాత్రేయను పరామర్శించారు. బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, జనసమితి వ్యవస్థాపకులు కోదండరామ్ తదితరులు దత్తాత్రేయ నివాసానికి చేరుకుని ఆయన్ని పరామర్శించారు.

చంద్రబాబు సంతాపం
వైష్ణవ్ హఠాన్మరణంపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రగాఢ సంతాపం తెలిపారు. వైష్ణవ్ చిన్న వయసులోనే కుటుంబానికి దూరం కావడం పెనువిషాదమన్నారు. ఎంబీబీఎస్ చేస్తూ భవిష్యత్‌కు బాటలు వేసుకుంటున్న వైష్ణవ్ అకాల మరణానికి గురికావడం కలచి వేసిందని చెప్పారు. ఒక్కగానొక్క కొడుకు ఆకస్మిక మరణం ఎంతో బాధాకరమని, దత్తాత్రేయ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైష్ణవ్ అంత్యక్రియలు సాయంత్రం జరగనున్నాయి.












Click it and Unblock the Notifications