హైదరాబాద్-షార్జా విమానానికి బాంబు బెదిరింపు: తర్వాత ఏం జరిగిందంటే?
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. హైదరాబాద్ నుంచి షార్జా వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విమానంలో వెళ్లిన ఓ ప్రయాణికుడు బాంబు ఉందంటూ కేకలు వేశాడు. దీంతో విమానాన్ని ఐసోలేషన్ ప్రాంతానికి తీసుకెళ్లి తనిఖీ చేశారు సీఐఎస్ఎఫ్ సిబ్బంది.
అయితే, విమానంలో ఎలాంటి బాంబు లేదని పోలీసులు తేల్చారు. ఆ సమయంలో విమానంలో 136 మంది ప్రయాణికులు ఉన్నారు. బాంబు ఉందంటూ బెదిరింపులకు గురిచేసిన వ్యక్తిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కాగా, గత కొంత కాలంగా విమానాలకు నకిలీ బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం నాగ్‌పూర్ విమానానికి కూడా బెదిరింపు వచ్చింది. అయితే అది ఆకతాయిలపనేనని తేల్చారు. నవంబర్ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడం అలజడి సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు.
ముంబై నుంచి అజర్‌బైజాన్‌కు వెళ్తున్న విమానంలో మహమ్మద్ అనే వ్యక్తి బాంబులను తీసుకెళ్తున్నాడని హెచ్చరించాడు. దీంతో సీఐఎస్‌ఎఫ్, స్థానిక పోలీసులు ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించగా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ఈ నేపథ్యంలో బెదింపులకు పాల్పడే వ్యక్తులపై విమాన ప్రయాణ నిషేధం విధించాలని పౌర విమానయాన శాఖ యోచిస్తోంది. అంతేగాక, జైలుకు పంపడంతోపాటు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.












Click it and Unblock the Notifications