బస్సుకోసం మంత్రికి చిట్టి చేతులతో లేఖ రాసిచ్చిన బుడతడు.. మంత్రి ఏం చేశారంటే!
అది ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని ఎర్ర బోయినపల్లి గ్రామం. ఆ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. దీంతో ఆ గ్రామంలోని ఒక బుడతడు తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని మంత్రికి వచ్చిరాని భాషలో చేతిరాతతో లేఖ రాశాడు. అయితే అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా..
బస్సు కావాలని లేఖ రాసిచ్చిన బుడతడు.. మంత్రి ఆశ్చర్యం
ఎటువంటి భయం లేకుండా కల్లూరులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి వెళ్లిన బాలుడు, తాను తన స్వహస్తాలతో రాసిన చిన్న లేఖను నేరుగా మంత్రికి అందించాడు. బాలుడి ధైర్యానికి, గ్రామ ప్రజల కోసం ఆర్టీసీ బస్సు కావాలని అడిగిన అతని ఆలోచనకి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆశ్చర్యానికి గురయ్యారు. ఎటువంటి భయం లేకుండా తన దగ్గరకు వచ్చిన బుడతడి ఆత్మవిశ్వాసం చూసి అబ్బురపడ్డారు.

బాలుడితో మాట్లాడిన మంత్రి పొంగులేటి.. వెంటనే బస్సు వెయ్యాలని ఆదేశం
ఆ బాలుడిని దగ్గరకు పిలిచి ఆప్యాయంగా మాట్లాడి గ్రామం వివరాలు, అక్కడ ఉన్న రవాణా సమస్యలను, బస్సు ఎక్కడ నుంచి వస్తుంది? గ్రామస్తులు బస్సు ఎక్కడ ఎక్కాల్సి వస్తుంది అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే టి జి ఎస్ ఆర్టీసీ అధికారులను పిలిచి ఎర్ర బోయినపల్లికి బస్సు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అయితే అధికారులు ఆ రూట్ లో బస్సు ఏర్పాటు చేయాలంటే ముందుగా సర్వే చేయాల్సి ఉంటుందని తెలిపారు.
బస్సు రాకుంటే నేరుగా నాకే ఫోన్ చెయ్యాలన్న మంత్రి
దీంతో మంత్రి పొంగులేటి సర్వే పేరుతో కాలయాపన చేయాల్సిన అవసరం లేదని, వెంటనే ఆ గ్రామానికి బస్సు సేవలు ప్రారంభించాలని తేల్చి చెప్పారు. వారం రోజుల్లోగా ఎర్ర బోయినపల్లి గ్రామానికి బస్సు వస్తుందని, ఒకవేళ రాకపోతే తనకే నేరుగా ఫోన్ చేయాలని ఆ బుడతడితో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న సమస్యలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన బుడతడి పైన కల్లూరులో ఆసక్తికర చర్చ జరుగుతుంది.
లేఖ రాసుకుని వచ్చిన బుడతడిపైనే అందరి చర్చ
సాధారణంగా భూ సమస్యలు, సంక్షేమ పథకాలకు సంబంధించిన అర్జీలు వంటి సమస్యలతో ప్రజా దర్బార్ కి వచ్చే చోట, తమ గ్రామానికి కలుగుతున్న ఇబ్బందిని మంత్రికి చెప్పాలని ఒక చిన్నారి రావడం, అది కూడా ఒక లేఖ రాసుకుని రావడం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. పెద్ద పెద్ద సమస్యలు ఉన్నా పరిష్కారం కోసం వెళ్ళని వాళ్ళు ఉన్న చోట ఒక బుడతడు బస్సు కోసం చూపించిన ధైర్యం ప్రతీ ఒక్కరికి ఆదర్శం.













Click it and Unblock the Notifications