గుడ్‌న్యూస్: తెలంగాణ పాఠశాలల్లో ఇక పౌష్టికాహారంతో బ్రేక్‌ఫాస్ట్ కూడా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు తీపి కబురు చెప్పింది ప్రభుత్వం. పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్(అల్పాహారం) అందజేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయిచింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
ఉదయం 10 నుంచి 11 గంటల సమయంలో విద్యార్థులకు బెల్లం, రాగి జావా కలిపిన బ్రేక్ ఫాస్ట్ అందజేస్తారు. దీంతోపాటు ఉన్నత పాఠశాలల విద్యార్థులకు తృణధాన్యాలను మధ్యాహ్న భోజనంలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
విద్యార్థుల్లో ఎక్కువ మంది పిల్లలు ఉదయం పూట ఏమీ తినకుండానే ఖాళీ కడుపుతో బడులకు హాజరవుతున్నారు. దీంతో వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

ఈ నేపథ్యంలోనే ఒకటి నుంచి పదోతరగతి వరకు విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి బ్రేక్‌ఫాస్ట్ ఇవ్వాలని నిర్ణయించారు. బలవర్ధకమైన బెల్లం కలిపిన రాగి జావను అందించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇదివరకే రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని బడుల్లో స్వచ్ఛంద సంస్థలు, ట్రస్ట్‌ల సహకారంతో విద్యార్థులకు రాగిజావను అందజేస్తున్నారు.
బెల్లం పౌడర్, రాగి పిండిని బడులకు అందజేయనుండగా.. మధ్యాహ్న భోజన పథకం కుక్ కమ్ హెల్పర్లు రాగిజావను తయారుచేసి విద్యార్థులకు అందజేస్తారు. మధ్యాహ్న భోజన పథకం మెనూలో వినూత్నంగా వారంలో ఒకరోజు వెజిటెబుల్ బిర్యానీని అమలు చేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా రాష్ట్రంలోని 25 లక్షల పైచిలుకు విద్యార్థులకు ప్రొటీన్లు, విటమిన్లు, క్యాలరీలతో కూడిన ఆహారాన్ని సమకూరుస్తున్నారు. ఏటా 225 రోజులపాటు ఒకపూట భోజనాన్ని అందజేస్తున్నారు. కాగా, ఇటీవలే మధ్యాహ్న భోజన చార్జీలను ప్రభుత్వం పెంచింది.
ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు గతంలో రూ.4.97 ఉండగా, రూ. 5.45కు పెంచగా, ప్రాథమికోన్నత తరగతుల విద్యార్థులకు గతంలో రూ.7.45 ఉండగా, రూ. 8.17కు పెంచింది. ఈ విద్యాసంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనంలో ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధక బియ్యం)ను చేర్చి ప్రొటీన్ల సమ్మిళితమైన భోజనాన్ని అందజేస్తారు. వారంలో మూడురోజులపాటు కోడిగుడ్లను అందజేస్తున్నారు. విద్యార్థులు కోరుకుంటే వాటికి బదులు అరటిపండ్లను అందజేస్తున్నారు.












Click it and Unblock the Notifications