Kavitha: పప్పన్నం, ఖైదీలతో భోజనం.. తీహార్ జైలులో కవిత మొదటి రోజు ఇలా
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తీహార్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. మంగళవారం ఆమెను జైలుకు వెళ్లారు. ఈరోజుతో జైలులో ఆమె మొదటి రోజు పూర్తయింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జైలులో 6వ నంబర్ విభాగంలో మరో ఇద్దరు మహిళా ఖైదీలతో పాటు కవిత భోజనం చేశారని సమాచారం. ఉదయం స్నాక్స్ తిని టీ తాగారు.
'కవిత మంగళవారం రాత్రి తన తోటి ఇద్దరు ఖైదీలతో కలిసి భోజనం చేశారు. అన్నంతో పాటు పప్పును తీసుకున్నారు. వీటిని తనతో పాటు ఉన్న మరో ఇద్దరు ఖైదీలకు కూడా వడ్డించి భోజనం చేశారు' అని జైలు వర్గాల ద్వారా తెలిసింది.టీ, ఆహారం, టీవీ చూసే సమయాలు ఇతర ఖైదీల మాదిరిగానే కవితకూ ఉంటాయని మరో అధికారి తెలిపారు.

కవిత ప్రత్యేకంగా నిర్దిష్ట వసతులు ఏమీ డిమాండ్ చేయలేదని జైలు వర్గాలు తెలిపాయి. నిబంధనల ప్రకారమే ఆమెకు వస్తువులను అందజేస్తామని అధికారులు వివరించారు.అయితే, కోర్టుత ఆదేశాల ప్రకారం.. కవితకు ఇంటి భోజనం, బెడ్, పరుపులు, చెప్పులు స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఉందని జైలు అధికారి వివరించారు.
అంతేగాక, దుస్తులు, పుస్తకాలు, పెన్ను, పేపర్లు, నగలు, మందులు బంగారు ఆభరణాలు ధరించేందుకు కూడా కోర్టు అనుమతి ఉంది. అయితే ఆమె జైలుకు వచ్చేటప్పుడు ఎలాంటి అభరణాలు ధరించలేదని జైలు వర్గాలు తెలిపాయి. ఆమెకు తీహార్ జైలు గ్రంథాలయంలోని పుస్తకాలు ఉపయోగించుకునే సౌలభ్యం ఉందని సదరు జైలు అధికారి వెల్లడించారు. కాగా, తీహార్ జైలు కాంప్లెక్స్‌లో సుమారు 500 మంది మహిళలు ఉన్నారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ మంత్రులు మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్ తర్వాత మూడో రాజకీయ నేత కవిత కావడం గమనార్హం. సిసోడియా జైలు నంబర్ 1 , సంజయ్ సింగ్‌కు జైలు నంబర్ 2 ను కేటాయించారు. మరో మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆప్ నేత సత్యేంద్ర కుమార్ ఏడో నంబర్ జైలులో ఉంచారు. ఇక, ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు ఏప్రిల్ 9 వరకు రౌస్ అవెన్యూ కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications