మన్మోహన్ సింగ్ గురించి కేటీఆర్ ఏం చెప్పారంటే..?
Dr Manmohan Singh: ప్రఖ్యాత ఆర్థికవేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల భారత్ రాష్ట్ర సమితి సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఘనంగా నివాళి అర్పించింది. దేశం గర్వించదగ్గ గొప్ప ఆర్థికవేత్తలలో ఒకరిగా, ఆధునిక భారత నిర్మాతగా అభివర్ణించింది. ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొంది.
డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వరుసగా రెండుసార్లు ప్రధానమంత్రిగా పని చేశారు మన్మోహన్ సింగ్.

ఆయన మృతి పట్ల మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంతాపం తెలియజేశారు. పార్టీ సీనియర్ నాయకుడు కేఆర్ సురేష్ రెడ్డితో కలిసి మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్లారు. పార్థివదేహానికి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.
దేశంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఆర్కటెక్ట్‌గా మన్మోహన్ సింగ్‌ను అభివర్ణించారు. ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన మనమధ్య లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. అద్భుతమైన మేధావి అని, బలమైన ఆర్థికరంగానికి పునాదులు వేశారని కొనియాడారు.
మాజీ ప్రధాని, దివంగత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRBRS గారు, బీఆర్ఎస్ ఎంపీలు శ్రీ సురేశ్ రెడ్డి, శ్రీ దామోదర్ రావు, శ్రీ వద్దిరాజు రవిచంద్ర. pic.twitter.com/knkiDcJ18l
— BRS Party (@BRSparty) December 27, 2024
మన్మోహన్ సింగ్ జెంటిల్‌మెన్ ప్రైమ్ మినిస్టర్ అని పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా, కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా, ప్రధానమంత్రిగా ఆధునిక భారత దేశాన్ని తీర్చిదిద్దారని, మాటలు తక్కువ- చేతలు ఎక్కువ అని నిరూపించగలిగారని అన్నారు.
దేశం కోసం అహరహం శ్రమించిన ప్రధానమంత్రుల్లో ఒకరిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. మానవతావాదిగా ఆయన సేవలు భవిష్యత్ తరాలకు ఆదర్శనీయం, సదా ఆచరణీయమని కేటీఆర్ పేర్కొన్నారు. భారత్ రాష్ట్ర సమితి తరపున పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించామని అన్నారు.












Click it and Unblock the Notifications