గులాబీ అంబాసిడర్ లతో ర్యాలీగా వరంగల్ సభకు.. తగ్గేదే లేదంటున్న బీఆర్ఎస్!
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 27వ తేదీన వరంగల్లో నిర్వహించనున్న సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కు బీఆర్ఎస్ పార్టీ హంగామా మొదలుపెట్టింది. గతంలో ఎన్నడు లేని విధంగా కనివిని ఎరుగని విధంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించాలని భావించిన బీఆర్ఎస్ అందుకు వరంగల్ ను వేదికగా చేసుకుంది.
సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ హంగామా
వరంగల్ లోని ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభను నిర్వహించి, ఈ బహిరంగ సభ ద్వారా మాజీ సీఎం, గులాబీ అధినేత కెసిఆర్ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి దిగడానికి రంగం సిద్ధం చేస్తుంది.
బి ఆర్ ఎస్ నిర్వహించే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కు హైప్ క్రియేట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.

ఎడ్ల బండ్ల ర్యాలీ మాత్రమే కాదు అంబాసిడర్ కార్ల ర్యాలీ కూడా
ఇప్పటికే ఎడ్లబండ్లతో ర్యాలీగా ఎల్కతుర్తి లో నిర్వహించే సభకు రావాలని ముఖ్య నేతలు గ్రామ గ్రామాన ప్రచారం చేస్తున్నారు. ఎడ్లబండ్లతో నియోజకవర్గాలలో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇక ఇదే సమయంలో గతంలో ఎంతో ప్రత్యేకంగా నిలిచిన అంబాసిడర్ కార్లతో ర్యాలీగా బి ఆర్ ఎస్ బహిరంగ సభకు వెళ్లాలని అంబాసిడర్ కార్లను సిద్ధం చేస్తున్నారు.
100 గులాబీ అంబాసిడర్ కార్లతో భారీ ర్యాలీ
బీఆర్ఎస్ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సందర్భంగా రవి యాదవ్ అనే యువనేత 100 అంబాసిడర్ కార్ లను సేకరించి, ఆ కార్లకు రిపేర్లు చేయించి, వాటన్నిటికీ గులాబీ రంగు వేయించి, కెసిఆర్ స్టిక్కర్లు అంటించి ర్యాలీగా వరంగల్ బహిరంగ సభకు వెళ్లాలని సిద్ధం చేశారు. 100 అంబాసిడర్ గులాబీ రంగు కార్లు రోడ్డుపై వెళ్తుంటే అది ప్రజలలో గులాబీ పార్టీకి ఉన్న ఇమేజ్ ని తెలియజేస్తుందని ఆ నేత భావిస్తున్నారు.
బీఆర్ఎస్ సింబల్ ప్రజల మనసులో నాటుకుపోయేలా కార్ల ర్యాలీ
తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ సింబల్ అంబాసిడర్ కారు .ఈ సింబల్ ను ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు తీసుకు వెళ్లడమే కాకుండా, ఈ సింబల్ ప్రజల మనసులో నాటుకుపోయేలా ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలకు అంబాసిడర్ కార్ల ర్యాలీని నిర్వహించనున్నామని సదరు యువనేత చెబుతున్నారు.
వచ్చే ఎన్నికలకు నియోజకవర్గానికి ఒక అంబాసిడర్ కారు
ప్రస్తుతం రిపేర్ చేసినటువంటి అన్ని కార్లను జాగ్రత్తగా మెయింటైన్ చేసి వచ్చే ఎన్నికలకు ప్రతి నియోజకవర్గానికి ఒక అంబాసిడర్ కార్ పంపిస్తానని ఆయన అంటున్నారు. ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి ఎమోషనల్ గా కనెక్ట్ అయిన అంబాసిడర్ కార్లతో ర్యాలీ చూడడానికి బాగుంటుందని పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications