బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్.. ఉద్రిక్తత
MLA Padi Kaushik Reddy: ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితికి చెందిన హుజూరాబాద్ శాసన సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. బెదిరింపుల కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ కేసులో వరంగల్ సుబేదారి పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. అనంతరం వరంగల్ కు తరలించారు.
గ్రానైట్ వ్యాపారి మనోజ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై భారత శిక్షా స్మృతి సెక్షన్ 308 (2), 308 (4), 352 కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం కౌశిక్ రెడ్డి ఇటీవలే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం రాలేదు. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది.

వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్నారు మనోజ్ రెడ్డి. 50 లక్షల రూపాయలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి బెదిరించినట్లు ఆయన భార్య ఉమాదేవి.. సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే కౌశిక్ రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది తప్పుడు కేసు అంటూ కౌశిక్ రెడ్డి ఆరోపిస్తోన్నారు.
రాజకీయ కక్షసాధింపుచర్యల్లో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కేసు పెట్టిందని విమర్శిస్తోన్నారు. గతంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు కౌశిక్ రెడ్డి. ఇప్పటికే హైడ్రా పేరుతో ప్రభుత్వం రోజుకో బిల్డింగ్‌ను కూలగొడుతోందని, హైదరాబాద్‌లో నివసించే సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని కౌశిక్ రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాలంటే చాలామంది భయపడుతున్నారని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తోన్నారని ఆరోపించారు. హైడ్రా పేరుతో కుట్రలకు ప్రభుత్వం పాల్పడుతోందని, హైదరాబాద్ అభివృద్ధిని ఉద్దేశపూరకంగానే అడ్డుకుంటోందని పాడి కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ట్రాప్‌లో తెలంగాణ ప్రభుత్వం పడిందని కౌశిక్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు డైరెక్షన్‌లో ఇక్కడి పెట్టుబడులన్నింటినీ కూడా అమరావతికి తరలించే ప్రయత్నానికి ప్రభుత్వం పూనుకుందని ఆరోపించారు. ఇలాంటి చర్యలను యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు.












Click it and Unblock the Notifications