హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ- స్టే నిరాకరణ..!!
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ కేసును సీబీఐకి బదలాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టేసింది. సీబీఐ దర్యాప్తునకు అనుమతి ఇచ్చింది
హైదరాబాద్: అధికార భారత్ రాష్ట్ర సమితికి చెందిన నలుగురు శాసన సభ్యుల కొనుగోలు కేసు- కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో విచారణ మరింత ముమ్మరం కానుంది. ఇది సీబీఐ చేతికి వెళ్లనుంది. ఈ కేసుపై విచారణ చేపట్టడానికి కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది గానీ.. ఇప్పుడు దీని నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ కేసులో సీబీఐ అడుగు పెట్టబోతోంది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..
బీఆర్ఎస్‌కు చెందిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ శాసన సభ్యుడు బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిని పార్టీ ఫిరాయించేలా ప్రలోభ పెట్టటానికి ప్రయత్నించినట్టుగా బీజేపీ నాయకులు ఆరోపణలను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సారథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ను ఏర్పాటు చేసింది.

నోటీసులు..
ఈ కేసులో సిట్.. ఇప్పటికే కొందరు బీజేపీ సీనియర్ నాయకులకు నోటీసులను జారీ చేసింది. నోటీసులను అందుకున్న వారిలో కర్ణాటకకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, జాతీయ కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తో పాటు భారత్ ధర్మ జనసేన (బీడీజేఎస్) అధ్యక్షుడు తుషార్ వెల్లంపల్లి, కేరళకు చెందిన డాక్టర్ జగ్గు కొట్టిలిల్, రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ, నందు కుమార్, సింహయాజి స్వామి - ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్నారు.

ఎఫ్ఐఆర్..
బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరడానికి నిందితులు తనను ప్రలోభ పెట్టారని, 100 కోట్ల రూపాయలను ఆఫర్ చేశారని పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు వారందరిపై ఇదివరకే సిట్ లుక్ అవుట్ నోటీస్ జారీ అయింది.

సింగిల్ జడ్జ్ బెంచ్..
అదే సమయంలో- సిట్ అధికారులు తమను వేధిస్తోన్నారంటూ ఆరోపితులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన సింగిల్ జడ్జి వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి బదలాయించింది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకించింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సీబీఐ పని చేస్తోన్నందున బీజేపీ నాయకులు తమకు అనుకూలంగా కేసును మార్చుకుంటారని ఆందోళన వ్యక్తం చేసింది.

స్టే నిరాకరణ..
సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ అప్పీల్ పిటీషన్ ను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఇవ్వాళ ఆదేశాలను జారీ చేసింది. సింగిల్ బెంచ్ జడ్జి జారీ చేసిన ఆదేశాలను సమర్థించింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ ను మెయింటెనబిలిటీ కారణంగా కొట్టివేసింది. స్టే ఇవ్వడానికి నిరాకరించింది.












Click it and Unblock the Notifications