మల్కాపూర్ చెరువులోనే కట్టిన భవనం.. బాంబులతో పేల్చివేత.. ఇంతకాలం ఏం చేశారు?
హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతల పర్వం కొనసాగుతుంది. హైదరాబాద్ నగర పరిధిలోని ఆక్రమణలకు గురైన చెరువులు, ఎఫ్.టి.ఎల్ పరిధి, బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. బుల్డోజర్లతో ఎక్కడికక్కడ కూల్చివేస్తున్నారు. ఇక తాజాగా నగరంలోని అనేక ప్రాంతాలలో హైడ్రా అధికారుల దూకుడు కొనసాగుతుంది. పలుచోట్ల కూల్చివేతల పర్వం యుద్ధ ప్రాతిపదికన సాగుతుంది.
మల్కాపూర్ చెరువులో బాంబులతో బహుళ అంతస్తుల భవనం పేల్చివేత
ఒక వైపు మూసీ పరీవాహక ప్రాంతాలలో హైడ్రా అధికారులు రంగంలోకి దిగి సర్వే చేస్తూ ఇళ్ళకు మార్కింగ్ చేస్తుంటే , మరోవైపు సంగారెడ్డి లోని మల్కాపూర్ చెరువులో కూడా అక్రమ నిర్మాణాలను అధికారులు నేల మట్టం చేస్తున్నారు. చెరువు నీళ్ల మధ్యలో కట్టిన బహుళ అంతస్థుల భవనాన్ని బాంబులు పెట్టి పేల్చి మరీ అధికారులు కూల్చివేశారు.

12 సంవత్సరాల క్రితం బహుళ అంతస్తుల భవన నిర్మాణం
ఈ సమయంలో బాంబులు పేలి శిథిలాలు ఎగిరి పడడంతో ఇద్దరు గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సికింద్రాబాద్ కు చెందిన ఒక వ్యక్తి 12 సంవత్సరాల క్రితం మల్కాపురం పెద్ద చెరువు ఎఫ్ టి ఎల్ పరిధిలో నీళ్లలోనే భవనాన్ని నిర్మించారు. ఈ భవనం లోపలికి వెళ్లడానికి కొంత దూరం మెట్లు కట్టి మరీ నీళ్లల్లో భవనాన్ని నిర్మించారు.
నీళ్ళలోనే భవనం.. అధికారులు ఏం చేశారు?
ఆ యజమాని కుటుంబ సభ్యులు వీకెండ్ లో ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారని స్థానికులు చెబుతున్నారు. 12 ఏళ్ళ క్రితం ఈ భవనం ఇంత క్లియర్ గా చేరువులోనే జరుగుతున్నా స్థానిక అధికారులు ఏం చేశారు? ఎందుకు అడ్డుకోలేదు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇంత కాలం ఈ భవనం విషయంలో చర్యలు ఎందుకు తీసుకోలేదు?
చెరువులోనే పిల్లర్లు వేసి కట్టి నిర్మాణానికి అనుమతులు ఎవరు ఇచ్చారు? ఒకవేళ అనుమతి లేకుండా బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మాణం చేస్తే చర్యలు తీసుకోకుండా ఎందుకు ఇంత కాలం ఊరుకున్నారు అన్నది ఈ భవనం కూల్చివేతతో ఆసక్తిగా మారింది. అధికారులు చూసీ చూడనట్టు బడా బాబులను వదిలివెయ్యటమే ఎక్కువ శాతం ఆక్రమణలకు కారణం అన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది.
సామాన్యులకే అన్ని రూల్స్.. వాళ్లకు కాదా?
నీళ్ళలోనే పిల్లర్లు వేసి చాలా స్ట్రాంగ్ గా నిర్మించిన ఈ భవనాన్ని కూల్చటానికి అధికారులు బాంబులు వినియోగించాల్సి వచ్చింది. మాములుగా చిన్న చిన్న ఇళ్ళు కట్టుకోవాలంటే సామాన్యులకు అనుమతులు ఇవ్వకుండా సవా లక్ష కారణాలు చెప్పి, ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించే అధికారులు ఇలాంటి నిర్మాణాల విషయంలో ఏం చర్యలు ఎందుకు తీసుకోరు? అన్నది ప్రతీ ఒక్కరి మనసులో మెదులుతున్న ప్రశ్న.












Click it and Unblock the Notifications