Cardiac Arrest: సినిమా చూస్తూ గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు మృతి!!
సినిమా చూస్తూ గుండెపోటుతో ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడు కుప్పకూలి మృతి చెందాడు.
ఇటీవల కాలంలో అకస్మాత్తుగా గుండెపోటులతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. ముఖ్యంగా యుక్త వయసులోని వారు సడెన్ హార్ట్ ఎటాక్ కు గురికావడం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. గుండెపోటు బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నట్టుగా తాజా పరిణామాలతో స్పష్టంగా అర్థమవుతుంది.
మొన్నటికి మొన్న కబడ్డీ ఆడుతూ కుప్పకూలిపోయి అనంతపురం జిల్లాకు చెందిన ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, పల్నాడు జిల్లాకు చెందిన మరొక విద్యార్థి నిద్రలోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఈ వరుస ఘటనలు మర్చిపోకముందే తాజాగా మరొక ఘటన చోటుచేసుకుంది ఖమ్మం జిల్లా మధిర మండలం నక్కలగరుబు గ్రామానికి చెందిన మురళీకృష్ణ అనే 26 సంవత్సరాల యువకుడు సినిమా చూస్తూ కుప్పకూలి పడిపోయాడు. అక్కడే ఉన్న స్నేహితులు అతనికి ఏమైందో అర్ధం కాక, వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు.

ప్రస్తుతం హైదరాబాద్లోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మురళీకృష్ణ బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా అతనికి ఒక మంచి సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది. ఈనెల 17వ తేదీన అతను సదరు కంపెనీలో ఉద్యోగంలో జాయిన్ కావలసి ఉంది. ఇక ఇటీవలే కొద్ది రోజుల క్రితం ఇంటికి వచ్చి తనకు సాఫ్ట్ వేర్ ఉద్యోగం వచ్చిందని తల్లిదండ్రులకు చెప్పి తన ఆనందాన్ని కూడా వారితో పంచుకున్నాడు. తల్లిదండ్రుల కష్టాలు ఇక తీరిపోయినట్టేనని, తాను ఉద్యోగం చేసి బాగా సంపాదించి వారిని బాగా చూసుకుంటానని చెప్పి హైదరాబాద్ కు తిరిగి వెళ్ళాడు.
ఎంతో సంతోషంగా ఉద్యోగం వచ్చిందని చెప్పిన కొడుకు సినిమాకి వెళ్లి కుప్పకూలి మరణించాడు అన్న వార్త తెలిసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎన్నో ఆశలతో పెంచుకున్న కొడుకు చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడంతో పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. ఇలాంటి బాధ ఎవరికీ రాకూడదని వారు కంటికి కడివెడు దుఃఖిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రతీ రోజూ పెద్ద సంఖ్యలో గుండె పోటు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. అకస్మాత్తుగా వస్తున్న గుండెపోటుల కేసులు పెరగడంతో ప్రతి ఒక్కరు సిపిఆర్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు పదేపదే చెబుతున్నారు.












Click it and Unblock the Notifications