దాంతో ఏసీబీ లాగుతోంది: రేవంత్ కేసు మలుపు తిరుగనుందా?
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు కీలక మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవినీతి, కుట్రలకు సంబంధించి రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సిన్హా, మత్తయ్యల పైన కేసు నమోదు చేసిన ఏసీబీ... కుట్రకు డబ్బు సమకూర్చిన ప్రయివేటు సంస్థలకు ఉచ్చు బిగించేందుకు సిద్ధమవుతోంది.
పన్నెండు సంస్థల నుంచి రూ.2 కోట్లు సేకరించారని, స్టీఫెన్ సన్‌కు ఇచ్చేందుకు ప్రయత్నించిన రూ.50 లక్షలు వాటిలోవేనని ఏసీబీ తేల్చినట్లగా సమాచారం. ఈ డబ్బు విషయమై ఏసీబీ కీలక వివరాలు సేకరించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారు? ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలతో టీడీపీ నేతలు సంప్రదింపులు జరిపారు? అనే కోణంలో, అదే విధంగా ముడుపుల అడ్వాన్సు, మిగతా డబ్బు ఎక్కడి నుండి సమకూర్చారన్న కోణంలోను విచారణ జరుపుతున్నారు.

నాలుగు రోజుల పాటు జరిపిన విచారణలో ముగ్గురు నిందితులను డబ్బు గురించి ప్రశ్నించారు. రేవంత్ నుండి సరైన సమాధానం రానప్పటికీ, మిగతా ఇద్దరు మాత్రం కొంత మాచారం ఇచ్చారని తెలుస్తోంది. ఈ వివరాల ఆధారంగా కూపీ లాగుతున్నారని తెలుస్తోంది.
సంఘటన జరగడానికి ముందురోజు ఈ డబ్బును 12 సంస్థల నుండి సేకరించారని గుర్తించారని సమాచారం. నిందితుల కాల్ డేటా, అందులోని ఫోన్ నెంబర్లు కూడా వారు ఆయా సంస్థలతో సంప్రదింపులు జరిపారని చెప్పేందుకు ఆధారాలున్నాయని అంటున్నారు.
స్టీఫెన్ సన్‌తో తమకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని నిందితులు చెబితే కేసు బలహీనపడుతుంది, కాబట్టి ఏసీబీ వ్యూహాత్మకంగా వారితో ఆర్థిక లావాదేవీలు లేవని చెప్పించినట్లుగా వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications