నేను బిజెపి, అన్నయ్య చెన్నమనేని సీపీఐ.. ఆశ్చర్యపోయేవారు: విద్యాసాగర్ రావు
హైదరాబాద్: తాను తన అన్నయ్య చెన్నమనేని రాజేశ్వర రావు స్ఫూర్తితోనే ఎదిగానని, నేను ఈ స్థాయికి రావడానికి ఆయనే కారణమని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర రావు అన్నారు. చెన్నమనేని రాజేశ్వర రావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు మంగళవారం పూర్తయ్యాయి.
ఈ సందర్భంగా ఆయన సోదరుడు, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర రావు ఓ ప్రకటన విడుదల చేశారు. బ్రిటిష్, నిజాం పాలకులపై అసమాన పోరాట పటిమ ప్రదర్శించిన రాజేశ్వర రావు మా పెద్దన్న అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందన్నారు.
రాజకీయనేతగా, శాసన సభ్యుడిగా చెన్నమనేని రాజేశ్వర రావు నిర్వహించిన పాత్ర అనితర సాధ్యం అన్నారు. కమ్యూనిస్టు అయిన మా అన్నయ్య ఇంట్లోనే ఉంటూనే, నేను ఏబీవీపీలో తిరిగినా, తర్వాత జనసంఘ్‌లో చేరినా, బీజేపీలో ఎదిగినా పల్లెత్తు మాట అనలేదన్నారు.
నా తమ్ముడి ఆలోచనా విధానం తప్పని ఆయన అనుకోలేదు కాబట్టే నేను ఈ స్థాయికి ఎదిగానని భావిస్తున్నానని చెప్పారు. శాసన సభలో ఒకేసారి తాను బీజేపీ పక్ష నేతగా, తన అన్నయ్య సీపీఐ పక్షనేతగా వ్యవహరించామని గుర్తు చేసుకున్నారు.
సభలో గానీ, బయట గానీ, ప్రచార సాధనాల్లో గానీ ఎక్కడా మా ప్రవర్తనపై ఆక్షేపణలు రాలేదన్నారు. అన్నదమ్ములమైనా సిద్ధాంతపరంగా ఎవరి తోవ వారిదే అన్నారు. ఇదే భావన అందరిలోనూ ఉండేదని, కొందరైతే మీరు అన్నదమ్ములేనా అని ఆశ్చర్యపోయేవారన్నారు.

విద్యాసాగర రావు - చెన్నమనేని రాజేశ్వర రావు
గతంలో ఓసారి విద్యాసాగర రావును రాజేశ్వర రావు తమ్ముడని పరిచయం చేసేవారని, ఇప్పుడు విద్యాసాగర రావు అన్నగా తనను పరిచయం చేస్తున్నారని, తన అన్నయ్య ఓ పుస్తకంలో గర్వంగా రాసుకున్నారని విద్యాసాగర రావు చెప్పారు.

రాజేశ్వర రావు అంత్యక్రియలు
తెలంగాణ సాయుధపోరాట యోధుడు, సీనియర్ నాయకుడు చెన్నమనేని రాజే శ్వరరావు అంత్యక్రియలు మంగళవారం మహాప్రస్థానం శ్మశానవాటికలో అధికార లాంఛనాలతో జరిగాయి.

రాజేశ్వర రావు అంత్యక్రియలు
ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు, బంధుమిత్రులు,అభిమానులు హాజరై తమ ప్రియతమ నేతకు తుది వీడ్కోలు పలికారు. రాజేశ్వరరావు తనయుడు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ చితికి నిప్పంటించగా అభిమానులు రాజేశ్వరరావు అమర్ రహే అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.

రాజేశ్వర రావు అంత్యక్రియలు
అంతకుముందు ఎమ్మెల్యే కాలనీలోని నివాసంలో రాజేశ్వరరావు భౌతికకాయానికి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఈటెల రాజేందర్ పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు.

రాజేశ్వర రావు అంత్యక్రియలు
మహాప్రస్థానంలో అధికార లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు.












Click it and Unblock the Notifications