ఇండీ కూటమి చలో లోక్‌భవన్ ర్యాలీ.. మంత్రులు అరెస్ట్!
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సర్ ప్రక్రియపై రాజకీయం హాట్ హాట్ గా మారింది. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండి కూటమి ఆరోపిస్తోంది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చెయ్యాలని ప్రధాన డిమాండ్ తో దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్ను ముడుతున్నాయి.
ఇదే క్రమంలో ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలపై ఆరోపిస్తూ, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో ఇండి కూటమి, టీపీసీసీ ఆధ్వర్యంలో 'చలో లోక్ భవన్' ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీలో కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామిలతో పాటు సీపీఎం, సీపీఐ, టీజేఎస్, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును కాపాడాలని నినాదాలు చేస్తూ సాగిన ర్యాలీ రాజ్‌భవన్‌కు చేరుకోగానే పోలీసులు మోహరించి అడ్డుకున్నారు.
ఈ క్రమంలో తోపులాట జరగడంతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదిలాఉంటే దేశంలో ఓటు హక్కును హరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశాల మేరకే ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్ ప్రక్రియను కొనసాగిస్తోందని, ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని తెలంగాణా సీఎం డిమాండ్ చేశారు.
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు పరిరక్షణకు, ప్రతిపక్ష నేతలపై అణచివేతకు వ్యతిరేకంగా వీధుల నుండి పార్లమెంట్ వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ఈ ఉద్యమం కేవలం కాంగ్రెస్ ది కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఇండియా కూటమి, ప్రజల ఉద్యమమని తెలిపారు. ఇదే క్రమంలో నేడు లోక్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు, మంత్రులు ప్రయత్నించారు. పోలీసులు వారు రాజ్ భవన్ కు చేరుకోగానే వారిని అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications
