వివాహేతర సంబంధం కోణం కూడా -కాలిపోయిన కారు డిక్కీలో బీజేపీ నేత శవం కేసుపై చందన దీప్తి వివరణ
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్ హత్య కేసును పోలీసులు ఛేధించారు. శ్రీనివాస్ స్థానిక బీజేపీ నేతల కూడా కావడం, అతి దారుణమైన పరిస్థితుల్లో ఆయన మృతదేహం లభ్యం కావడంతో ఈ కేసు రాజకీయంగానూ చర్చనీయాంశమైంది. అయితే, చాలా నేరాల్లాగే శ్రీనివాస్ హత్యకు కూడా వివాహేతర సంబధాలు, వ్యాపార లావాదేవీల్లో తేడాలే కారణమని పోలీసులు చెబుతున్నారు. శ్రీనివాస్ హత్యోదంతపై మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి బుధవారం మీడియాతో మాట్లాడారు..

చందన దీప్తి ప్రెస్ మీట్..
సాధారణంగా పెద్ద నేరాలు జరిగినప్పుడే ఎస్పీ స్థాయి అధికారులు మీడియా ముందుకొచ్చి వివరణ ఇస్తుండటం తెలిసిందే. అయితే మెదక్ జిల్లా వెల్తుర్దిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్ బీజేపీ నేత కూడా కావడంతో హత్య కేసును పోలీసులు పక్కాగా డీల్ చేశారు. జిల్లా ఎస్పీ చందన దీప్తి స్వయంగా రంగంలోకి దిగి, శ్రీనివాస్ హత్యకు దారి తీసిన పరిస్థితులు, అందుకు గల కారణాలు, నిందితుల వేట తదితర వివరాలను వెల్లడించారు. ఈకేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిని శివను అరెస్టు చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని ఎస్పీ చెప్పారు.

24 గంటల్లోనే కేసు కొలిక్కి..
వెల్దుర్తి రియల్టర్ శ్రీనివాస్ హత్య కేసును మెదక్ జిల్లా పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేధించారని ఎస్పీ చందన దీప్తి తెలిపారు. సాంకేతిక ఆధారాల సాయంతో ఘటన జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించామన్నారు. శ్రీనివాస్ గొంతు కోసి చంపినట్టు పోస్టు మార్టం రిపోర్టులో తేలిందని చెప్పారు. శివ, పవన్, నిఖిల్ కలిసి శ్రీనివాస్‌ను హత్య చేశారు. చనిపోయిన తర్వాత మృతదేహాన్ని కారులో పెట్టి దగ్ధం చేశారని వివరించారు. ప్రధాన నిందితుడు శివను కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశముందన్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను కూడా త్వరలో అరెస్టు చేస్తామన్నారు. అయితే..

వివాహేతర సంబంధాలు..
తన భర్తకు ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని, తరచూ తనతో గొడవ పడేవారని మృతిచెందిన వ్యాపారి శ్రీనివాస్ భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పలువురితో స్థిరాస్తి వ్యాపార లావాదేవీల్లోనూ గొడవలు జరుగుతున్నాయని కూడా ఆమె చెప్పారు. ఈ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. కాగా, హత్యకు గల కారణం మాత్రం పూర్తిగా నిర్ధరణ కాలేదని, వివాహేతర సంబంధం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ చందన దీప్తి చెప్పారు. పూర్తి ఆధారాలు లభించిన తర్వాతే కచ్చితంగా చెబుతామని పేర్కొన్నారు. నిజానికి..

కారు డిక్కీలో శవం.. కలకలం
శ్రీనివాస్ హత్యోదంతంపై పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. వెల్దుర్తి-నర్సాపూర్ ప్రధాన రహదారిలో మంగళపర్తి గ్రామ శివారులో ప్రధాన రహదారి పక్కన సోమవారం రాత్రి 10:30 సమయంలో కారు తగలబడడాన్ని మంగళపర్తి గ్రామానికి చెందిన ఓ ఆటోడ్రైవర్ మొదట గుర్తించి తగలబడుతున్న ఆ కారు దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. అదేరాత్రి గ్రామానికి చెందిన ఓ వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశాడు. స్థానిక సర్పంచ్ రామకృష్ణారావు ఇచ్చిన సమాచారంతో మంగళవారం ఉదయం పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్, సీఐ స్వామిగౌడ్, నర్సాపూర్ సీఐ లింగేశ్వర్‌రావు, నారాయణపేట సీఐ నాగార్జున గౌడ్ తదితరులు సంఘటనా స్థలంలో పరిశీలించగా, కాలిపోయిన కారు డిక్కీలో కుక్కిపెట్టిన శవం పూర్తిగా కాలిపోయి కనిపించింది..

భార్య హైదవి ఫిర్యాదు, భిన్న కోణం
కారు డిక్కీలో శవం పూర్తిగా కాలిపోయి, గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో చనిపోయిన వ్యక్తి వివరాలు తెలుసుకోవడం పోలీసులకు కష్టంగా మారింది. కారు ఇంజిన్ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మెదక్ పట్టణంలోని ఓ సినిమా టాకీస్ యజమాని వాహనంగా దాన్ని గుర్తించారు. మృతుడు మెదక్‌కు చెందిన శ్రీనివాస్‌గా కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో. మృతుడి నోటిలో ఉన్న కృత్రిమ దంతాల ఆధారంగా శ్రీనివాస్‌ను ఆయన భార్య హైందవి గుర్తించారు. భర్త హత్యపై ఆమె వెల్దుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని, శ్రీనివాస్ తనతో తరచూ గొడవ పడేవాడని హైందవి పోలీసులకు తెలిపారు. దర్యాప్తు కొనసాగిస్తూనే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో శ్రీనివాస్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే..
Recommended Video

కోటిన్నర డీల్.. లక్షన్నర సుపారి?
కాలిపోయిన కారు డిక్కీలోని మృతదేహం శ్రీనివాస్ దిగా గుర్తించిన పోలీసులు హత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్ హత్యకు వివాహేతర సంబంధాలు లేదా ఆర్థిక లావాదేవీలే కారణమై ఉండొచ్చని అతని భార్య హైందవి అనుమానించారు. పోలీసు వర్గాల ద్వారా తెలిసిన సమాచారం అంటూ ప్రధాన మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం.. కారులోనే శ్రీనివాస్‌ను కత్తితో పొడిచి చంపిన నిందితులు మృతదేహాన్ని డిక్కీలో వేసుకుని 6 గంటలపాటు కారులోనే తిరిగారు. అనంతరం కారుకు నిప్పటించి పరారయ్యారు. శ్రీనివాస్ హత్యకు రూ.కోటిన్నర వ్యవహారమే కారణమని, లోన్ తీసుకుని డబ్బులు ఇచ్చినా తిరిగి చెల్లించలేదనే కోపంతో హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలినట్టు సమాచారం. రూ.15 లక్షలు సుపారీ తీసుకుని దుండగులు శ్రీనివాస్‌ను హత్య చేసినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications