లోపాలు సరిదిద్దుకుంటాం - మారిన బీఆర్ఎస్ స్వరం, ఏం జరుగుతోంది..!!
తెలంగాణలో ఎన్నికల రాజకీయం మారుతోంది. కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ ఉత్కంఠ పోరులో లెక్కలు మారుతున్నాయి. కాంగ్రెస్ కు అనుకూలంగా పరిస్థితి ఉందనే అంచనాలు అధికమయ్యాయి. ఈ సమయంలో బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తూనే..తమ పైన ఉన్న విమర్శలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. తమకు దూరమయ్యారని గుర్తించిన వర్గాలను దగ్గర తీసుకొనే ప్రయత్నం చేస్తోంది. కొద్ది రోజుల్లోనే గులాబీ నేతల వాయిస్ లో ఆత్మరక్షణ ధోరిణి కనిపిస్తోంది.
మారుతున్న స్వరం:తెలంగాణలో కాంగ్రెస్ కు 80 సీట్లు వస్తాయని..ఒక్క సీటు కూడా తగ్గదని రేవంత్ సవాల్ చేస్తున్నారు. కాంగ్రెస్ పాలన వస్తే ప్రయోజనం ఏంటని కేసీఆర్, కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ను గెలిపించాలా, ఓడించాలా అనే అంశం పైనే ప్రధానంగా ఎన్నిక జరుగుతోందని విశ్లేషకలు అంచనా వేస్తున్నారు. తొమ్మదిన్నారేళ్ల పాలన తమకు హ్యాట్రిక్ విజయం తెచ్చి పెడుతుందని విశ్వసించిన గులాబీ నేతలు గ్రౌండ్ నుంచి వస్తున్న నివేదికలతో అలర్ట్ అయ్యారు. కేసీఆర్ కుటుంబం..అహంకార ధోరణి అంటూ చేసిన ప్రచారం ప్రజల్లోకి వెళ్లిందా అనే చర్చ మొదలైంది. తాజాగా మంత్రి కేటీఆర్ తమ పైన వస్తున్న విమర్శలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు.

అహంకారం కాదు:తెలంగాణ మీద కేసీఆర్‌కు ఉన్నది మమకారమని.. అహంకారం కాదని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ధరణి పైన కాంగ్రెస్ ను రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తారని ప్రతీ సభలోనూ చెబుతున్నారు. ధరణి రద్దు చేస్తే వచ్చే నష్టాలను వివరిస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ ఒక టీవీ ఛానల్ నిర్వహించిన చర్చా వేదికలో ధరణి గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ధరణి పోర్టల్ లో చిన్న చిన్న చిక్కులు.. చికాకులు ఉన్నాయని అంగీకరించారు. అధికారంలోకి వచ్చిన తరువాత దీని పైన ఒక నిపుణుల సంప్రదింపుల కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఎలుకలు ఉన్నాయని ఇంటిని తగలబెట్టుకుంటామా అని కేటీఆర్ ప్రశ్నించారు.
అందుబాటులో ఉంటాం:ఎన్నికల ప్రచారంలో భాగంగా యువతతో కేటీఆర్ సమావేశమైన సమయంలో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు..ఉద్యోగాల భర్తీ పైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ సమయంలోనూ కేటీఆర్ వారిని బుజ్జగించే ప్రయత్నం చేసారు. విద్యార్ధుల ఆకాంక్షలకు అనుగుణంగా టీఎస్పీఎస్సీని మార్చుతామని హామీ ఇచ్చారు. తానే స్వయంగా విద్యార్దులతో చర్చించి..టీఎస్పీఎస్సీ జాబ్ క్యాలెండర్ రూపొందిస్తామని చెప్పుకొచ్చారు. ఇక, సీఎం కేసీఆర్..మంత్రి కేటీఆర్ సైతం తమ సొంత నియోజకవర్గ కేడర్ కు అందుబాటులో ఉంటామని హామీలు ఇస్తున్నారు. తాము ఎవరినీ కలవమనే అభిప్రాయం స్థానిక నేతల్లో ఉన్నట్లు గుర్తించటంతో..ఎన్నికల వేళ వారిని బుజ్జగించి సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయి..ఫలితాలు ఎలా ఉంటాయనేది చూడాలి.












Click it and Unblock the Notifications