యాదాద్రి భువనగిరి జిల్లాలో చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం
చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం సంభవించింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు ఆలేరు స్టేషన్‌కు చేరుకుంటున్న సమయంలో S5 బోగీలో మంటలు చెలరేగాయి. తొలుత దట్టమైన పొగ వెలువడింది. ఆ వెంటనే భగ్గుమంటూ మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో బోగీ మొత్తం కూడా వ్యాపించాయి. మంటలను గుర్తించిన వెంటనే లోకో పైలెట్లు రైలును నిలిపివేశారు.
ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కొందరు బోగీ నుంచి కిందికి దూకారు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదని ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కాగా ఈ అగ్నిప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. మంటలు చెలరేగిన కారణాలపై విచారణ కొనసాగుతోంది. షార్ట్ సర్క్యూట్ లేదా సాంకేతిక లోపం కారణమని భావిస్తున్నారు.

సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, రైల్వే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. రైల్వే రెస్క్యూ టీమ్, ఇతర సహాయక దళాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బోగీ నుంచి పొగ, మంటలు వెలువడటాన్ని ఇందులో స్పష్టంగా చూడొచ్చు. అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని, కోచ్ అంతా పొగతో నిండిపోయిందంటూ ఓ ప్రయాణికుడు చెప్పడం రికార్డయింది. రైలు పూర్తిగా ఆగేలోపే చాలా మంది దూకేశారని అని వివరించాడు.












Click it and Unblock the Notifications